
సీఎంది అధికార దాహం: శ్రీకాంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ వ్యామోహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
2011లో అభివృద్ధి ప్యాకేజీ అడ్డుకున్నారు
పదవీ వ్యామోహంతో రెండుసార్లు ప్రజలకు అన్యాయం చేశారు
చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి తెలుగుతల్లిని నిలువునా చీల్చడానికి ఒప్పుకున్నారు
బాబు ‘విభజన’ లేఖ వెనక్కి తీసుకుని రాజీనామా చేస్తే... రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం ఉంది
ఇప్పటికైనా కాంగ్రెస్‌తో చేసుకున్న ఒప్పందమేమిటో ఆయన బయటపెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ వ్యామోహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోపాటు, ప్రాణత్యాగాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధాన కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేస్తూ వీటిపై రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు అందజేసిన తర్వాత 2011లో కేంద్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఢిల్లీ పిలిచి, తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లోని కొన్ని వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్యాకేజీ విషయమై చర్చించిన మాట వాస్తవమా? కాదా? అప్పుడు మీ స్వార్థం కోసం, పదవిని ఎంజాయ్ చేసేందుకు ప్యాకేజీని అడ్డుకున్నది నిజం కాదా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రం ప్రయత్నించినట్టుగా మీ పార్టీ నేతలే కొందరు చెబుతున్నారు... అయితే మీరు పదవీకాంక్షతో రెండుసార్లు ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అన్యాయం చేసిన మాట నిజంకాదా? ఇవి అవాస్తవమైతే దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాలి..’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోని సీఎం ఢిల్లీ వెళ్లి అక్కడివారి కాళ్లు పట్టుకుంటారని.. బయటకొచ్చిన తర్వాత వారి అనుమతితో ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాను సమైక్యవాదిన ని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న కిరణ్.. సీడబ్ల్యూసీ, యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవికి రాజీనామా చేయాలని ఎంత డిమాండ్ చేసినా పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పేద,మధ్య తరగతి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల డ్రామా వీధి నాటకాన్ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘ఆంటోనీ కమిటీ వేశారని, రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నామని వారంటారు.. మరోవైపు హోంమంత్రి షిండే మాత్రం విభజన ప్రక్రియ ఆగలేదంటారు. దీనికి ఏం సమాధానం చెబుతారు ఆ ఎంపీలు? ఇలాంటి వ్యక్తులకు పదవుల్లో కొనసాగే అర్హత ఉందా? సీఎం కిరణ్, కాంగ్రెస్ ఎంపీలు వారి పదవుల కోసం డ్రామాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని అన్నారు.
సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకే బాబు యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలతో లాలూచీ పడి తెలుగుతల్లిని నిట్టనిలువునా కోసేయడానికి ఒప్పుకున్న దుర్మార్గుడని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం గోతికాడి నక్కలా మారి కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అన్నారు. ప్రజల కోసం పాటుపడతానంటూ బస్సుయాత్ర చేస్తున్న చంద్రబాబు తన వైఖరిని ఎందుకు స్పష్టం చేయడం లేదని నిలదీశారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కుతీసుకుని ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగి రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశముందని శ్రీకాంత్ చెప్పారు.
ఇప్పటికైనా కాంగ్రెస్‌తో చేసుకున్న ఒప్పందమేమిటో చంద్రబాబు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు బస్సుయాత్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కిర ణ్ కుమార్‌రెడ్డి తానూ యాత్ర తలపెడతానంటూ మీడియాకు లీకులిస్తున్నారని చెప్పారు. ప్రజల సెంటిమెంటును చీల్చడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు, కిరణ్‌లను చరిత్ర క్షమించదని, వారు చేస్తున్న డ్రామాలను సమైక్యాంధ్ర జేఏసీ నేతలు మున్ముందు నిలదీసే అవకాశం కచ్చితంగా ఉంటుందని శ్రీకాంత్ పేర్కొన్నారు.