అనుపమ్‌ఖేర్‌కు పాక్ వీసా నిరాకరణ | Sakshi
Sakshi News home page

అనుపమ్‌ఖేర్‌కు పాక్ వీసా నిరాకరణ

Published Wed, Feb 3 2016 4:29 AM

అనుపమ్‌ఖేర్‌కు పాక్ వీసా నిరాకరణ - Sakshi

కరాచీ సాహిత్య ఉత్సవాలకు 18 మందికి ఆహ్వానం
* ఖేర్ దరఖాస్తు చేయలేదని వెల్లడి
* వీసా తిరస్కరణకు నా దేశభక్తి కారణమా?: అనుపమ్ ప్రశ్నలు

న్యూఢిల్లీ/కరాచీ: బాలీవుడ్ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు అనుపమ్ ఖేర్‌కు పాకిస్తాన్ వీసా నిరాకరించింది. పాక్‌లోని కరాచీలో శుక్రవారం నుంచి జరిగే కరాచీ సాహిత్య ఉత్సవం(కేఎల్‌ఎఫ్)లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు భారత్‌కు చెందిన అనుపమ్‌ఖేర్‌తో పాటు ప్రముఖ నటి నందితాదాస్, కాంగ్రెస్ నేత సల్మాన్‌ఖుర్షీద్ తదితర 18 మంది ప్రముఖులను ఆహ్వానించారు.

ఖేర్ మినహా మిగతా అందరికీ పాక్ వెళ్లడానికి గాను ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా మంజూరు చేసింది. అయితే.. ఖేర్ ఎలాంటి వీసా కోసం ఏ దరఖాస్తూ చేసుకోలేదని పాక్ ఎంబసీ పేర్కొంది. ఖేర్‌కు ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం తెలిసిందే. అందరికీ వీసా ఇచ్చి తనకు వీసా నిరాకరించటం చాలా విచారం, నిరుత్సాహం కలిగిస్తోందని ఆయన మంగళవారం అన్నారు. కశ్మీరీ పండిట్ అంశాన్ని లేవనెత్తటం, ప్రధాని మోదీకి మద్దతివ్వటం, దేశభక్తిపరుణ్ని  కావటం వల్లే తనకు వీసా నిరాకరించారా? అన్నారు. ‘వారి ప్రదర్శనలకు భారత్‌లో ఒక చోట అభ్యంతరాలంటే.. మరొక చోటకు ఆహ్వానిస్తాం. కానీ అటువైపు నుంచి ఆ ప్రతిస్పందన లేదు’ అని అన్నారు.  
 
వీసా కోసం దరఖాస్తు చేయవద్దన్నారు: కేఎల్‌ఎఫ్
 ఈ విషయమై ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌ను సంప్రదించగా.. ఖేర్ వీసా కోసం తమకు దరఖాస్తు  సమర్పించలేదని.. కాబట్టి ఆయనకు వీసా మంజూరు చేయటం లేదా నిరాకరించటం అనే దానికే ఆస్కారం లేదని హైకమిషన్ పేర్కొంది. కరాచీ సాహిత్య ఉత్సవ నిర్వాహకులు మాత్రం.. ఖేర్‌కు వీసా మంజూరు చేయబోమని, కాబట్టి ఆయనకు వీసా కోసం దరఖాస్తు చేయవద్దని సలహా ఇవ్వాలని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ తమకు సూచించిందని చెప్పటం గమనార్హం.

మతం, ఇండో-పాక్ సంబంధాలపై సామాజిక మాధ్యమాల్లో అనుపమ్ క్రియాశీలంగా స్పందిస్తుండటం వల్ల  వీసా కోసం దరఖాస్తు చేయవద్దని సూచించినట్లు పాక్‌వర్గాలు తెలిపాయి. తాను వీసా కోసం దరఖాస్తు చేయలేదని పాక్ హైకమిషన్ చెప్పటం పెద్ద జోక్ అని, అబద్ధమని ఆయన తప్పుపట్టారు. వీసా దరఖాస్తు లాంఛనాలను కరాచీలోని నిర్వాహకులే పూర్తిచేశారని చెప్పారు. ‘నాకు ఎందుకు వీసా నిరాకరించారో తెలియదు.

నా దేశభక్తి వల్లా? నేను నా దేశం గురించి మాట్లాడతాను కనుకనా? నేను ఆ దేశానికి వెళ్లి నా దేశాన్ని విమర్శించననా? నేను ఉగ్రవాదుల భాషను మాట్లాడను’ అని అన్నారు. దీనిపై పాక్‌తో  మాట్లాడాలని కేంద్రాన్ని కోరతానన్నారు. గత ఏడాది పాక్‌లో ఓ కార్యక్రమానికి హాజరవ్వాల్సిన ఖేర్‌కు అప్పడు కూడా పాక్ హైకమిషన్ వీసా నిరాకరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement