మళ్లీ తెరపైకి ఓపెన్‌ జైలు ప్రతిపాదన | Delhi's first open jail in Baprola proposal back on table | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి ఓపెన్‌ జైలు ప్రతిపాదన

Jul 5 2014 7:20 PM | Updated on Sep 2 2017 9:51 AM

జైలు వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా బాప్రోలా ప్రాంతంలో ఓపెన్ జైలు నిర్మించాలన్న సుదీర్ఘకాల ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది.

 న్యూఢిల్లీ: జైలు వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా బాప్రోలా ప్రాంతంలో ఓపెన్ జైలు నిర్మించాలన్న సుదీర్ఘకాల ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇటీవల నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఇందుకోసం బాప్రోలాలో స్థలాన్ని సేకరించాలని జైలుశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఓపెన్‌జైలు చుట్టూ గోడలు, కాపలా వంటి ఏ ఇతర అడ్డంకులూ ఉండవు. శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండి, సత్ప్రవర్తన కలిగిన వారిని ఓపెన్ జైలులో ఉండడానికి అనుమతిస్తారు. ఖైదీల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి, విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలసి పోవడానికి వీలుగా ఓపెన్‌జైలు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సీనియర్ అధికారి ఒకరు అన్నారు.

 

నిజానికి 1996లోనే ఓపెన్ జైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే బాప్రోలాలో ల్యాండ్ మాఫియా ఆగడాల వల్ల జైళ్లశాఖకు భూమి కొనుగోలు చేయడం సాధ్యం కాలేదు. ఓపెన్ జైలు నిర్మాణం వల్ల తీహార్ జైలుపైనా భారం తగ్గుతుంది. కేవలం ఆరువేల మందికి వసతి కల్పించగల తీహార్ జైలులో ప్రస్తుతం 10 వేల మందిని ఉంచుతున్నారు. దీనిపై భారం తగ్గించడానికి కొత్తగా తొమ్మిది జైళ్లు నిర్మిస్తున్నామని, రోహిణి జైలులో అదనంగా మూడు భవనాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఒక అధికారి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement