భారత నౌకాదళంలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువైపోతున్నాయి. తన సీనియర్ రెండుసార్లు తనను లైంగికంగా వేధించారని ఒక యువ డాక్టర్ ఆరోపించారు.
భారత నౌకాదళంలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువైపోతున్నాయి. తన సీనియర్ రెండుసార్లు తనను లైంగికంగా వేధించారని ఒక యువ డాక్టర్ ఆరోపించారు. దీంతో నిందితుడైన సర్జన్ కమాండర్‌ను నేవీ అధికారులు బలవంతంగా సెలవులో పంపారు. అతడిపై ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సంవత్సరం రిపబ్లిక్‌డే సందర్భంగా విశిష్ట సేవా పతకం అందుకున్న సదరు కమాండర్‌కు నావల్ అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి అంశాలను నేవీ చాలా తీవ్రంగా తీసుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారాలను సహించబోదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కెప్టెన్ ర్యాంకు అధికారి నేతృత్వంలో సర్జన్ కమాండర్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ బోర్డు నియమించారు.
తొలిసారి తనను వైస్ అడ్మిరల్ నివాసంలో మే 6వ తేదీన లైంగికంగా వేధించినట్లు జూనియర్ డాక్టర్ చెప్పారు. వైస్ అడ్మిరల్ తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను చూసేందుకు తామిద్దరం వెళ్లామని, అక్కడ తాను బాత్రూంకు వెళ్లినప్పుడు చాలా అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. దీనిపై ఆమె అప్పుడే సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో భారత త్రివిధ దళాలలో తరచు లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోధ్‌పూర్‌లో ఒక సీనియర్ అధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఓ ఫైటర్ పైలట్‌ను వైమానిక దళం విధుల నుంచి తొలగించింది. ఇక నేవీ కూడా వివాహేతర సంబంధం, అసభ్య ఎస్ఎంఎస్‌లు పంపిన కేసుల్లో ఇద్దరి ఉద్యోగాలు ఊడబీకింది.