తెరపైకి కొత్త ముఖాలు! | 'crore to vote' in the case acbi notices | Sakshi
Sakshi News home page

తెరపైకి కొత్త ముఖాలు!

Jul 15 2015 12:30 AM | Updated on Aug 17 2018 12:56 PM

తెరపైకి కొత్త ముఖాలు! - Sakshi

తెరపైకి కొత్త ముఖాలు!

‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి.

‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌కు ఏసీబీ నోటీసులు
ఓటుకు డబ్బు తీసుకోవడానికి  సిద్ధమైన వారిపైనా దృష్టి

 
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. ఈ వ్యవహారంలో మరికొం దరి ప్రమేయమున్నట్లుగా గుర్తించింది. అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌కు మంగళవారం సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకల్లా తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.  ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఏసీబీకి లభించిన ఆధారాలతో పాటు కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాల్లో కృష్ణకీర్తన్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మే 31న నామినేటెడ్ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, ఉదయసింహలు కృష్ణకీర్తన్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే కృష్ణకీర్తన్ తన తండ్రి వేం నరేందర్‌రెడ్డి బాటలో ఏసీబీ విచారణకు హాజరవుతారా, లేక తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు మాదిరిగా అజ్ఞాతంలోకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

 నివేదికే కీలకం..
 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక కీలకంగా మారుతోంది. కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్ ఫోన్‌లో కొన్ని కాల్స్ రికార్డ్ అయ్యాయి. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్ విశ్లేషించి ఒక నివేదికను అందజేసింది. దీని నుంచి ఏసీబీకి కొంత కీలక సమాచారం లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సండ్రకు మొదట సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షి) కింద నోటీసులు జారీచేసిన ఏసీబీ.. తర్వాత నిర్ణయం మార్చుకుని నిందితుడిగా పేర్కొంటూ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది. సెబాస్టియన్, సండ్రల మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. అయితే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముగ్గురు (రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ) కూడా ఈ వ్యవహారంలో సండ్ర పోషించిన పాత్రపై తమ కస్టడీలో చెప్పకపోవడం పట్ల ఏసీబీ అనుమానిస్తోంది. సండ్ర, సెబాస్టియన్‌ల ఫోన్ సంభాషణల ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన జనార్దన్‌పై దృష్టి కేంద్రీకరించిన ఏసీబీ.. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తోంది.
 
త్వరలో మరింత మందికి
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ మరో కోణంపైనా దృష్టి సారించింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం కోసం డబ్బు తీసుకోవడానికి సమ్మతించిన వారినీ విచారించాలని నిర్ణయిం చినట్లు తెలిసిం ది. ఇందులో భాగంగా కొందరు ప్రజాప్రతినిధుల్ని గుర్తించిన ఏసీబీ అధికారులు త్వరలో వారికి నోటీసులు జారీచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదటగా సండ్రతో ఫోన్ సంభాషణలు జరిపిన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే ఒకరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement