కూటమిలో తలో మాట! | BJP MLA comments on the administration in the state | Sakshi
Sakshi News home page

కూటమిలో తలో మాట!

Feb 9 2026 3:41 AM | Updated on Feb 9 2026 3:41 AM

BJP MLA comments on the administration in the state

రాష్ట్రంలో పాలన కమ్మగా సాగుతోందన్న బీజేపీ ఎమ్మెల్యే

బీజేపీ రాష్ట్ర నేతల సమావేశంలో ఈ వ్యాఖ్యలపై కూటమిలో కలకలం

ఇటీవల నామినేటెడ్‌ పదవుల్లో అన్యాయం జరిగిందన్న జనసేన నేత

పైకి కలిసే ఉన్నా టీడీపీ ఏకఛత్రాధిపత్యంపై లోపల రుసరుసలు

తనకు అవసరం ఉన్నప్పుడు ఒకలా.. మిగతా సమయాల్లో మరోలా వ్యవహరిస్తోన్న టీడీపీ

మిత్రపక్షాలు టీడీపీని ప్రశ్నించే స్థాయికి చేరాయంటున్న రాజకీయ పరిశీలకులు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ పొత్తు రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. పైకి మూ­డు పార్టీలు కలిసే ఉన్నప్పటికీ, లోలోన మాత్రం టీడీపీ తమను పెద్దగా పట్టించుకోవడం లేదని రుసరుసలా­డుతు­న్నా­యి. కూటమి కట్టకపోతే అధికారంలోకి వచ్చే వారమే కాదని, ఈ పరిస్థితిలో అందరం కలిసి అధికారం చేపట్టినప్పుడు ప్రాధా­న్య­­త కూడా అలానే ఉండాలని జనసేన, బీజేపీలో చర్చ జరు­గుతోంది. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఇతర చిన్న పార్టీ­లతో పొత్తులు పెట్టుకున్నప్పుడు పూర్తి పెద్దన్న హోదాలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించినా, మిత్రపక్ష చిన్న పార్టీలను  అణగదొక్కేలా వ్యవహరించినా, పెద్దగా పట్టించుకోని పరిస్థి­తులు ఉండేవి. ఇప్పుడు కేవలం 19 నెలల పాలనలోనే తెలు­గుదేశం పార్టీ ఒంటెత్తు పోకడలను మిత్రపక్ష జనసేన, బీజేపీ నేతలు తప్పుపట్టే పరిస్థితివచ్చింది. సీఎం చంద్రబాబు కేవలం ఒక్క కులానికే పెద్ద పీట వేయడాన్ని ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తప్పుపట్టారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే కమ్మగా ఉందని చెప్పారు. పైగా ‘కమ్మ’గా అంటే తాను ప్రత్యేకించి చెప్పక్కర లేదని, మీకందరికీ (సమావేశంలో ఉన్నవారికి) అర్థమై ఉంటుందన్నారు. ఆ కమ్మ­తోపాటే మనందరం ఉన్నామని చెప్పారు. ఒక్క కులం, మతం అని కాదు.. ఎవరు గట్టిగా పని చేస్తారో వారికి అవకాశం ఇవ్వా­ల­న్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమ­య్యా­యి.

పెత్తనమంతా టీడీపీ నేతలదే
బీజేపీ–జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయించడం.. ఆయా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ గ్రామ స్థాయి నేతలను టీడీపీ నేతలు పట్టించుకునే పరిస్థితే లేకపోవడంతో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతు­న్నారు. 

ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాజీనా­మా చేసిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా కూటమి పార్టీల మధ్య నామినేటెడ్‌ పదవుల పంపకం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదవులిచ్చే వారి పేరు పక్కన జనసేన నేత అని పెట్టారు తప్ప.. వాళ్లు జనసేన పార్టీ కోసం ఎప్పుడూ పని చేసిన వారు కాదంటూ బొలిశెట్టి వాపోయిన విషయం తెలిసిందే. జనసేన నేతలు కానప్పటికీ, టీడీపీ నేతల­కు జనసేన ముద్ర వేసి పదవుల పందేరం చేశారని పలువురు ఆవేద­న వ్యక్తం చేశారు. 

కొన్నిట్లోనే ఉమ్మడి కార్యాచరణ 
మిత్రపక్షాల పట్ల టీడీపీ తమకు అవసరం ఉన్నప్పుడు ఒకలా.. మిగతా సమయాల్లో మరోలా వ్యవహరిస్తున్న తీరును పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న సందర్భంలో పొత్తులో ఉన్న మిత్రపక్షాలకు కొద్దిపాటి రాజకీయ ప్రయోజనం కూడా దక్కకూడదన్నట్టు వ్యవహరిస్తారని పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. 

అలాంటిది తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్‌ చార్జిషీటు దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో బీజేపీని బలవంతంగా భాగస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీలో చర్చ జరుగుతోంది. 

2024 సెప్టెంబర్‌లో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చేసిన తీవ్ర ఆరోపణలకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్‌ చార్జిషీటు తర్వాత వ్యక్తిగతంగా తాను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాగానే, బీజేపీని ఈ అంశంలోకి లాగేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను ప్రత్యేకంగా మంత్రుల సమావేశానికి పిలిపించారని రాజకీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. 

ఉమ్మడి కార్యాచరణ అంటూ తన పాపాన్ని అందరి మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారని తప్పు పడుతున్నారు. నామినేటెడ్‌ పదవులు, అధికారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో పాలన కమ్మగా ఉంది
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి 
బీజేపీ లేకుంటే టీడీపీ, జనసేన రాష్ట్రంలో నిలబడలేవు
రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ కీలకం.. తక్కువగా అంచనా వేయొద్దు
తిరుపతి గాంధీ రోడ్డు : రాష్ట్రంలో పాలన కమ్మగా సాగుతోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి భవితవ్యాన్ని నిర్ణయించే శక్తి బీజేపీకే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడే కాళహస్తి ఆనంద్‌ అడిగాడు.. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందన్నా అని. ఎన్టీఆర్‌ హయాంలో పాలన ఎలా సాగుతోందని ఒకరు గజ్జల మల్లారెడ్డిని అడిగితే కమ్మగా సాగుతోందని చెప్పారు. 

ఇప్పుడు నేనూ అదే చెబుతున్నా. రాష్ట్రంలో పాలన ఇంకా కమ్మగా సాగుతోంది. ఆ పరిస్థితి పోవాలి. కమ్మగా అంటే మీకు అర్థమై ఉంటుంది. అయితే ఈ కమ్మతో పాటే మనందరం ఉన్నాం. అందువల్ల కుల, మతాలకు అతీతంగా నిజాయితీగా కష్టపడే వారందరికీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. బీజేపీ లేకుండా తెలుగుదేశం గానీ, జనసేన గానీ రాష్ట్రంలో రాజకీయంగా నిలబడలేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని, అధిక శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఈ విషయంలో గట్టిగా మాట్లాడాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలకం అని తెలిపారు. గూగుల్, కాగ్నిజెంట్‌ వంటి బహుళజాతి సంస్థలు రాష్ట్రానికి రావడానికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ పాత్రను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement