
విదేశాలు, దుస్తులపైనే ఆయన మక్కువ
ప్రధాని నరేంద్రమోదీకి.. దేశంలో రైతులు, పేదల దీనస్థితి గురించి ఏ మాత్రం పట్టదని.. విదేశీ పర్యటనలు, దుస్తుల ధారణపైనే ఆయనకు మక్కువ ఎక్కువ
మోదీకి రైతులు, పేదల దీనస్థితి పట్టదు: రాహుల్ ధ్వజం
బేగుసరాయ్(బిహార్): ప్రధాని నరేంద్రమోదీకి.. దేశంలో రైతులు, పేదల దీనస్థితి గురించి ఏ మాత్రం పట్టదని.. విదేశీ పర్యటనలు, దుస్తుల ధారణపైనే ఆయనకు మక్కువ ఎక్కువ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. మోదీ ఇటీవలి అమెరికా పర్యటనలో 16 దుస్తుల్లో కనిపించారన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం బేగుసరాయ్, షేక్‌పురాల్లో జరిగిన బహిరంగసభల్లో రాహుల్ ప్రసంగించారు. ‘ఎప్పుడూ తెల్లదుస్తులనే ధరిస్తూ, అన్ని రకాల మనుషులతోనూ కలసిపోయే బిహార్ సీఎం నితీశ్‌లా కాకుండా.. మోదీ ఎప్పుడూ రంగురంగుల దుస్తుల్లో, చుట్టూ సూటుబూటు వేసుకున్న కార్పొరేట్ పెద్ద తలకాయల మధ్య కనిపిస్తారు.
వారు మాత్రమే ఎంతో జ్ఞానవంతులన్నట్లు వారు చెప్పేది వింటారు’ అని అన్నారు. మోదీ ఎప్పుడు చూసినా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని.. కానీ దేశంలో చినిగిన దుస్తులతో ఉన్న ఒక రైతుతోనో ఒక నిరుద్యోగితోనో ఒక్కసారైనా కలసి నిల్చున్న ఫొటోను ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు జ్ఞానం లేదని మోదీ భావిస్తారని.. అందుకే వారిని ఎప్పుడూ కలవలేదని విమర్శించారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచుతానని చెప్పిన మోదీ ఆ హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.