ఏకపక్షం.. నిరంకుశం

ఏకపక్షం.. నిరంకుశం - Sakshi


* రాష్ట్ర విభజన నిర్ణయంపై జీవోఎం ముందు వైఎస్సార్ సీపీ స్పష్టీకరణ

* సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలి

* సరైన హేతుబద్ధత, ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విడదీయడం సమంజసం కానేకాదు

* జగన్ రాసిన 8 పేజీల లేఖను జీవోఎంకు అందజేసిన మైసూరా

* మైసూరాతోపాటు జీవోఎం సభ్యులతో భేటీ అయిన గట్టు

* ఓట్ల కోసమో, సీట్ల కోసమో విభజన దురదృష్టకరమన్నాం: మైసూరా

* నదీ జలాల సమస్యను, అన్నిటికీ కార్యక్షేత్రమైన హైదరాబాద్ గురించి వివరించాం

* ఏదైనా బిల్లు తెచ్చి సోనియాను దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారని అడిగాం

* మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు

* కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది

 

సాక్షి, న్యూఢిల్లీ: ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సుస్పష్టంగా చెప్పింది. సరైన హేతుబద్ధత, గట్టి ప్రాతిపదిక లేకుండా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం, సమర్థనీయం కానే కాదని తెలిపింది. సమైక్యాంధ్రప్రదేశ్ అనే తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొంది. సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. జీవోఎం ఆహ్వానం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు బుధవారం ఉదయం హోం శాఖ కార్యాలయంలో  జీవోఎం సభ్యులతో భేటీ అయ్యారు.



విభజనపై పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్, కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన ఎనిమిది పేజీల లేఖను మైసూరా వారికి అందజేశారు. జీవోఎం సభ్యుల్లో ముగ్గురు మాత్రమే.. సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్, వీరప్పమొయిలీ పాల్గొన్న ఈ భేటీ 20 నిమిషాల పాటు కొనసాగింది. వీరు కూడా మైసూరా బృందం చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు తప్ప ఏమీ మాట్లాడలేదని తెలిసింది. చివర్లో షిండే మాత్రం ‘మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. జీవోఎంతో భేటీ అనంతరం మైసూరా విలేకరులతో మాట్లాడారు.



‘‘పార్టీ, ప్రభుత్వం మధ్య ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది. అంతా వాళ్ల సొంతింటి వ్యవహారంలా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పార్టీలతో ఈ భేటీలు కూడా కంటితుడుపు చర్య మాత్రమే. వాళ్లు చేయదల్చుకున్నదేదో చేస్తూ ఏదో రికార్డు కోసం ఇదంతా సాగిస్తున్నారు. పేరుకు పార్టీలను సంప్రదించినా అవి చెప్పేదేం చేయడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలి ఆదేశాల ప్రకారమే వారు నడుచుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. జీవోఎం స్పందన ఏమిటని అడగ్గా.. ‘‘వాళ్లకు 112 ప్రశ్నలు సంధించాం. వాటికి జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు..’’ అని మైసూరా చెప్పారు. పార్టీ తరఫున జీవోఎం ముందు చేసిన వాదనను ఆయన వివరించారు.



నదీ జలాలు చాలా క్లిష్టమైన సమస్య

‘‘కొందరు ప్రత్యేక రాష్ట్రం సోనియాగాంధీ బర్త్‌డే గిఫ్ట్ అని అన్నారు. అదేనా విభజనకు మీ ప్రాతిపదిక? దేశంలో మరెన్నో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకంత స్పీడ్‌గా వెళుతున్నారు? విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ఆలోచించడం లేదు. 70 శాతం మంది  ప్రజల అభిప్రాయాలను మీరు గుర్తించడం లేదు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నదీజలాలు చాలా క్లిష్టమైన సమస్య. ఇప్పటికే ఎన్నో ట్రిబ్యునళ్లు ఉన్నాయి. ఆ ట్రిబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను ఏ రాష్ట్రమూ పాటించడం లేదు, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే మీరేం చేయగలిగారు?’’ అని అడిగినట్లు మైసూరా తెలిపారు.



మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి

‘‘ సోనియాగాంధీ మనదేశ పౌరసత్వం తీసుకుని 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు ఏదైనా బిల్లు తెచ్చి ఈ పౌరసత్వం చెల్లదని.. దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారు? అలాగే 60 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత సెంటిమెంట్‌గా ఫీలవుతారో.. ఎంత బాధ పడతారో మీరు అర్థం చేసుకుంటున్నారా?’’ అని లేఖలో ప్రశ్నించినట్టు చెప్పారు. జీవోఎంకు నిర్దేశించిన 11 విధివిధానాలపై తమ అభిప్రాయాల్ని అడగలేదని, తాము సమైక్యంగా ఉండాలని చెప్తున్నం దున వాటిపై అభిప్రాయం అడిగేదేముంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

 

జగన్ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తారు

అధికారంలో ఉన్న పార్టీ బలహీనంగా ఉన్నచోట రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటే అది దేశ సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ.. దేశ ప్రయోజనాల కోసం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణార్థం విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలనూ కలుస్తారని మైసూరా తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయాన్ని కూడగడతారన్నారు. విభజనపై తమ నిరసనలు, పోరాటం కొనసాగుతాయని స్పష్టం చేశారు.



‘‘ఇప్పటివరకు అధికార పార్టీ ఇష్టానుసారం చేసింది. ఇకమీదట కుదరదు. మేమైతే బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగడతాం’’ అని చెప్పారు.  హైదరాబాద్ విషయంలోనూ కేంద్రం ఆలోచన సరికాదని, శాంతిభద్రతలు, రెవెన్యూ తదితర అంశాలను గవర్నర్‌కి ఇవ్వడమో లేదా కేంద్రం చేతిలోకి తీసుకోవడమో సబబు కాదని, ఇది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలను ఈ తరహాలో ఆక్రమించడం సమర్థనీయం కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

 

అప్పుడు, ఇప్పుడు సమైక్యమే...

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న మాటను లోగడ ఎందుకు కేంద్రానికి చెప్పలేదన్న ప్రశ్నకు మైసూరా స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని మాపై పెత్తనం చేయొద్దు. మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి. అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీ ఆలోచన ఉండాలని మేం చెప్పాం. ఆ రోజున మేం చెప్పినదాని అర్థం విభజన చేయాలని కాదు. సమస్యను పరిష్కరించలేరు కనుక యథాతథంగా ఉంచాలని అర్థం స్ఫురించేలా మేం మా వైఖరి చెప్పాం. దానికి మీరు వక్రభాష్యం చెప్పడం సరికాదు. మేం ఆ రోజున చెప్పింది సమైక్యమే.. ఇప్పుడు చెప్తున్నదీ సమైక్యమే’’ అని స్పష్టం చేశారు.



నేరుగా సమైక్యమని అప్పుడు ఎందుకు చెప్పలేదని అడగ్గా.. ‘‘అప్పటి పరిస్థితుల్లో వారు అడిగినదానికి మేం అది చెప్పాం. ఇప్పుడు విభజిస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అంటే విభజన వద్దు, సమైక్యంగా ఉంచండని కోరుతున్నాం.. ఇందులో డొంక తిరుగుడు ఏం లేదు.’’ అని ఆయన వివరించారు. ‘‘సెంటిమెంట్ వేరు, అభివృద్ధి వేరు. విభజిస్తే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగదని, నష్టపోతారని మేం చెప్తున్నాం. సెంటిమెంట్‌ని గౌరవించడం వేరు, విభజన వేరు. విభజన అనేది పరిష్కారం కాదు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అనేది మా పార్టీ అభిప్రాయం’’ అని కొన్ని ప్రశ్నలకు జవాబుగా మైసూరా చెప్పారు. సమైక్యంగా ఉంటే అభివృద్ధి జరిగే పరిస్థితి తప్పకుండా ఉందన్నారు.

 

తెలుగుజాతికి పట్టిన తెగుళ్లు టీడీపీ, కాంగ్రెస్‌లు: గట్టు

విభజన పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలుగు ప్రజలను హింసిస్తున్నాయని గట్టు అన్నారు. ఆ రెండు పార్టీలు తెలుగు జాతికి పట్టిన తెగుళ్లుగా ఆయన అభివర్ణించారు. జీవోఎంతో భేటీ అనంతరం ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో ఆ రెండు పార్టీలు డబుల్‌గేమ్ ఆడుతూ, ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. తెలంగాణపై ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ కార్యాలయాన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించాలని సూచించారు. వెనుకబాటుతనానికి విభజన ఏమాత్రం పరిష్కారం కాదని అన్నారు. సమర్థ పరిపాలన, అభివృద్ధి ద్వారా వెనుకబాటుతనాన్ని అధిగమించవచ్చని తెలిపారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు విభజనను కోరుకోవడం లేదన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top