పాకిస్థాన్,ఇండియాలు పరస్పరం చర్చించుకుని, సంప్రదింపుల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందంపై ఒక నిర్ణయానికి రావాలని చైనా కోరింది.
బీజింగ్: ఉడీ ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సింధూ జలాల ఒప్పందం రద్దు, సీమాంతర ఉగ్రవాదం తదితర విషయాలపై చైనా ఆచితూచి స్పందించింది. అసలు వైఖరి ఎలా ఉన్నప్పటికీ పైకి మాత్రం శాంతివచనాలు వల్లెవేసింది. ఇండియా-పాకిస్థాన్ లు కలిసి కూర్చుని చర్చించుకోవడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుంగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు.
'పాకిస్థాన్, ఇండియాలు పరస్పరం చర్చించుకుని, సంప్రదింపుల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందంపై ఒక నిర్ణయానికి వస్తాయని ఆశిస్తున్నాం. ఇరువురి మధ్య మైత్రినెలకొనాలని బాధ్యతగల పొరుగుదేశంగా చైనా కోరుకుంటోంది. ఆసియాలో శాంతి, సుస్థిరతలకు భారత్-పాక్ ల స్నేహం ఎంతో కీలకం. అయితే సీమాంతర ఉగ్రవాదం లేనప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆమేరకు ఇరు దేశాలూ దగ్గరవ్వాలి'అని జెంగ్ షుంగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
'1960 నాటి సింధూ జలాల ఒప్పందం'పై సోమవారం ఢిల్లీలో సమీక్షజరిపిన ప్రధాని మోదీ.. పాక్ వైపునకు ప్రవహిస్తోన్న నదీ జలాల్లో భారత్ కు ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింధూ ఒప్పందం రద్దుపై స్పష్టత రావాల్సిఉన్నది. మరోవైపు పాక్.. సింధూ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దుచేసుకోలేదని, ఒకవేళ అలా చేస్తే ఐక్యరాజ్యసమితికి, భద్రతామండలికి ఫిర్యాదుచేస్తామని ప్రకటించింది.