అంతా ఒకే మాటపై ఉండాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | All seemandhra representatives to be standard on word: YSRCP | Sakshi
Sakshi News home page

అంతా ఒకే మాటపై ఉండాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Aug 6 2013 12:48 AM | Updated on Sep 27 2018 5:56 PM

అంతా ఒకే మాటపై ఉండాలి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - Sakshi

అంతా ఒకే మాటపై ఉండాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే విషయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేమాటపై నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు సూచించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే విషయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేమాటపై నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు సూచించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ తరహా రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 కాంగ్రెస్ నేతలు విభజన అంశంపై ఒక్కొక్కరూ ఒక్కొక్క వైఖరితో మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ‘‘తమ గుండెలను చీల్చేసినట్లు రాష్ట్రాన్ని విభజించారనే బాధతో ఉద్యోగులు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులంతా రోడ్లెక్కి ఉద్యమిస్తున్నారు. కొందరు గుండె ఆగి మృతి చెందారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే వాంఛ ప్రజల్లో ఇంత బలీయంగా ఉంటే దానిని కాంగ్రెస్ నేతలు గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం పెట్టి సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పకుండా, తీర్మానం చేశాం, సంతకాలు చేశామంటున్నారు’’ అని విమర్శించారు.
 
  ‘‘రాష్టాన్ని మూడుగా విభజించి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌అంటున్నారు. హైదరాబాద్‌లో తనకు ఆస్తులున్నాయి కనుక చిరంజీవి దాని గురించే మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు దేనికోసం పోరాడుతున్నారు? వారి మనోభావాలేమిటి? ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారు? సీమాంధ్ర ప్రాంతం ఎందుకు అట్టుడుకుతోంది? అని తెలుసుకునే ఇంగిత జ్ఞానం కూడా ఈ నేతలకు లేకపోవడం దురదృష్టకరం’’ అని మండిపడ్డారు. ప్రజలు కోరుతున్న అంశాన్ని డిమాండ్ చేయకుండా  నాయకులు తాము సొంతంగా చేసే ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానం వద్ద గట్టిగా వాదించిన కేంద్ర మంత్రి కావూరి ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు.
 
 ఉద్యోగులకు రక్షణగా ఉంటాం
 విభజన పేరుతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఉద్యోగికైనా ఇబ్బందులు కలగజేసినా, అవమానించినా తాము అక్కడకు వెళ్లి వారికి రక్షణగా నిలబతామని శ్రీకాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రం రావణకాష్టం కావడానికి సోనియాగాంధీ, చంద్రబాబులే కారణమని ఆరోపించారు. హైదరాబాద్, సాగునీటి జల విధానం, మౌలిక సదుపాయాలు వంటివాటిపై ఏమీ మాట్లాడకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న 30, 40 లక్షల మంది సీమాంధ్రులకు ఇక్కడ జీవించే హక్కు లేదా? అని నిలదీశారు. ఒక తండ్రిలాగా అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోలేదు కనుకనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. విభజన నిర్ణయం రాజకీయ లబ్ధి కోసమే తీసుకున్నారని కొరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement