జంగిల్‌ రాజ్‌.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన | Chandrababu wicked rule has reached its peak with Ambati Rambabu Issue | Sakshi
Sakshi News home page

జంగిల్‌ రాజ్‌.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:06 AM

Chandrababu wicked rule has reached its peak with Ambati Rambabu Issue

అంబటి కార్యాలయానికి నిప్పు పెడుతున్న టీడీపీ రౌడీ , మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు , అంబటిని హత్య చేసేందుకు ఆయన కార్యాలయంలోకి ప్రవేశించిన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు

రాష్ట్రంలో పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన 

ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం  

చేయి చేసుకున్న టీడీపీ నేతలు మల్లీ, కనపర్తి తదితరులు.. టీడీపీ ‘ముఖ్య’ 

నేతల ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో ఇల్లు, కార్యాలయంపై దాడి  

ఫర్నిచర్, కార్లు ధ్వంసం.. రాళ్లు, కోడిగుడ్లు, కర్రలు, రాడ్లతో బీభత్సం 

పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు  

పథకం ప్రకారమే కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి వచ్చిన టీడీపీ గూండాలు  

వందల సంఖ్యలో ఇంటి చుట్టూ చేరి చెలరేగిపోయిన టీడీపీ అల్లరి మూకలు  

సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా కొనసాగిన దారుణకాండ  

ఏ దశలోనూ నిలువరించకుండా చోద్యం చూసిన వందలాది మంది పోలీసులు  

లోకేశ్‌ కార్యాలయం నుంచి ప్రతి నిమిషం పర్యవేక్షణ..  

రాత్రి 10 గంటలకు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన రౌడీలు  

అక్రమ కేసుతో అంబటి అరెస్ట్‌.. గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు 

అంతకు ముందు అంబటికి ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌   

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలను కలిసేందుకు ఎస్పీ ససేమిరా

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ సృష్టిస్తోంది. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి వైఎస్సార్‌సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది.  

పక్కా స్కెచ్‌తో దాడులు
శనివారం ఉదయం గుంటూరు రూరల్‌ మండలం గోరంట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవునా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ వందన.. అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సిద్ధార్థనగర్‌లోని తన కార్యాలయానికి అంబటి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. 

కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. ఒకవేళ అరెస్ట్‌ చేసినా, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈలోగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నల్లపాడు సీఐ వంశీధర్‌ అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి నోటీసు ఇవ్వడానికి వచ్చానని చెప్పి కొద్దిసేపు అక్కడి పరిస్థితులు గమనించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లంక మాధవి అంబటి ఇంటి ముందుకు వచ్చి చెప్పు చూపించి దుర్భాషలాడారు. రండి తేల్చుకుందాం అంటూ బూతులు తిడుతూ రెచ్చగొట్టారు. 


కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సం
అప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు. 

అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. 

బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూ
టీడీపీ నాయకుడు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు కొంత మంది వికలాంగులను సైతం తీసుకొచ్చి మైక్‌లో బూతులు తిట్టారు. ‘నా కొడకా.. అంబటీ బయటికి రారా..’ అంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం లంకించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ బీభత్సం రాత్రి 10 గంటలు అయినప్పటికీ కొనసాగింది. ఫోన్లు చేసి గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అక్కడికి రప్పించారు. హిజ్రాలను, దివ్యాంగులను కూడా తీసుకువచ్చి గొడవ చేయించారు. 

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ కూడా జనాన్ని అక్కడికి తరలించారు. అంబటి రాంబాబు కార్యాలయంలో అప్పటికే ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూరి ఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, సోషల్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఆళ్ల కిరణ్, పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా ఖాన్‌ తదితరులు అంబటి కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. గొడవ విషయం తెలియగానే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబటి రాంబాబుకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని సర్వత్రా చర్చ
అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్న గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్లెదుటే ఫర్నీచర్‌ను ధ్వంసం చేస్తుంటే.. కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకొచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పని తీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ హోం మంత్రి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ సమన్వయకర్తలు బలసాని కిరణ్‌కుమార్, వనమా బాలవజ్రకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాలేదు. గంటకు పైగా నాయకులు ఎస్పీ ఇంటి ముందు నిలబడే ఉన్నారు. చివరికి ఎస్పీ లైన్‌లోకి వచ్చి తాను గుంటూరులో లేనని, అడిషనల్‌ ఎస్పీని కలవాలని చెప్పారు. ఐజీ కూడా ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు.  

అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు 

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నేతపై టీడీపీ గూండాల దాడి
అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్‌యాదవ్‌పై విరుచుకు పడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని కారును సైతం ధ్వంసం చేశారు. తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన అశోక్‌ను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తమకు అడ్డువచ్చిన ఎవరినైనా చంపేస్తాం రండిరా అంటూ టీడీపీ గూండాలు తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అశోక్‌ వాపోయాడు.

అర్ధరాత్రి దాటినా..
టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగు­లగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యా­లయంపై విసురుతున్నారు. కవరేజ్‌ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్‌ టీవీ కెమెరామెన్‌తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు. కాగా, అంబటి రాంబాబుపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. 

ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్‌ విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు గుర్తు తెలి­యని ప్రాంతానికి తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్‌ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం.  

చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాను ఏ వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, 24 గంటల్లో ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పి తాను వచ్చేశానని తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు వెళ్లింది ఫ్లెక్సీలు చించేందుకు కాదని, వాటిని తొలగించాలని చెప్పేందుకు మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ఒక్కసారిగా తన కారుపైకి తెగబడ్డారని చెప్పారు. 

టీడీపీకి చెందిన ఓ మహిళ అసభ్యకరంగా మాట్లాడటంతో తాను ప్రతిస్పందనగా వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈలోగా చంద్రబాబూ దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం తనకు లేనేలేదని స్పష్టం చేశారు. తనపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడానికి టీడీపీ గూండాలు కారు డోరు తీశారని, తాను ప్రాణ రక్షణ నిమిత్తం అక్కడున్న వారిపై మాట్లాడానని చెప్పారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ టీడీపీ నాయకురాలు (లంకా మాధవి) సిద్ధార్థనగర్‌లోని తన ఇంటి వద్దకు వచ్చి చెప్పు పట్టుకుని నానాయాగీ చేసినా పోలీసులు ఆమెను ఆపలేదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌ల రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తేలేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. తాను అరెస్ట్‌కు భయపడేదే లేదని, ఒకవేళ అరెస్ట్‌ చేస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్‌కు కూడా దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. తన ఇంటి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌పై, తనపై అభిమానంతో వచ్చారని.. అంతేతప్ప తన అరెస్ట్‌ను అడ్డుకునేందుకు కాదని స్పష్టం చేశారు.

రారా చూసుకుందాం.. ఇక్కడే పాతేస్తాం
గోరంట్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘రారా చూసుకుందాం.. నిన్ను ఇక్కడే పాతేస్తాం’ అంటూ రాయలేని పదాలతో టీడీపీ గూండాలు బూతు పురాణంతో విరుచుకుపడటంతో భక్తులు హడలిపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కలియుగదైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అసత్యమని సీబీఐ సిట్‌ నివేదికలో వెల్లడి కావడంతో శనివారం అంబటి రాంబాబు గోరంట్లలోని శ్రీవేంకటేశ్వరాలయంలో పాపపరిహార పూజల్లో పాల్గొన్నారు. ఇది తెలిసిన టీడీపీ గూండాలు కర్రలు, ఇనుపరాడ్లు తీసుకుని అంబటిపైకి దూసుకొచ్చారు. 

వేలాది మంది భక్తులు చూస్తుండగా.. పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. టీడీపీ మహిళా గూండాలు సైతం అసభ్య పదజాలంతో రోడ్లపై కర్రలు, రాడ్లతో హల్‌చల్‌ చేశారు. టీడీపీ గూండాలను అడ్డుకోవాల్సిన పోలీసులు.. అక్కడ నుంచి వెళ్లాలని అంబటి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ముందుకు కదులుతున్న అంబటి కారుపై టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి దిగి కారు అద్దాలను పగలగొట్టి హత్య చేయడానికి యత్నించారు. టీడీపీ గూండాల హడావుడికి అమరావతి రోడ్డులో ప్రయాణికులు సైతం భయాందోళనకు 
గురయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement