లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఎలాంటి సూచన లేకుండా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్న లారీ వేగంగా వెళ్తున్న కారును ఢీకొట్టింది.
రామగుండం(కరీంనగర్): లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఎలాంటి సూచన లేకుండా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్న లారీ వేగంగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం ఇందుగులపల్లి వద్ద గల రహదారిపై శనివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది.
వివరాలు.. గోదావరిఖనికి చెందిన ఛోటూమియా(25) వివాహాది శుభకార్యాలకు ఫొటోలు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో తన బృందంతో కలిసి కరీంనగర్‌లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి స్వస్థలానికి వస్తుండగా.. ఇందుగులపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఛోటూమియా అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అతివేగంగా ఉండటంతో.. లారీ క్యాబిన్ కిందకు దూసుకెళ్లి అక్కడే ఇరుక్కుపోవడంతో.. డ్రైవర్ మృతదేహం అందులో ఇరుక్కొపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు.