అక్రమ నిర్మాణాలపై యువతి ట్వీట్‌

Young Women Tweet to KTR About Illegal Constructions - Sakshi

జీహెచ్‌ఎంసీ అధికారుల్లో కలవరం

బంజారాహిల్స్‌: ‘అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?  మీరంతా అవినీతిపరులా? లేదా రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? మీ కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది’ అని రిషితారెడ్డి అనే యువతి చేసిన ట్వీట్‌ జీహెచ్‌ఎంసీలో అధికారులను కలవరానికి గురిచేసింది. సదరు యువతి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలపై చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సోమాజిగూడలోని కపాడియా లైన్‌లో అక్రమంగా పది అంతస్తుల హోటల్‌ నిర్మిస్తున్నారని, కొన్నాళ్ల క్రితం జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపింది.

అక్రమ నిర్మాణానికి సంబంధించి ఈ నెల 16న అనుమతి కోసం తీసుకున్న ప్లాన్, ప్రొసీడింగ్స్, ట్రేడ్‌ లైసెన్స్, ఫైర్‌ ఎన్‌వోసీ ఇవ్వాలని సదరు యజమానికి నోటీసులు ఇచ్చామంటూ ఆ కాపీని విశ్వజిత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందుకు ఏమాత్రం సంతృప్తి చెందని ఓ వ్యక్తి  ట్విట్టర్‌ వేదికగా.. నోటీసులు ఇచ్చారు గానీ.. ఇప్పటి వరకు చర్యలు ఏమీ తీసుకోలేదని ప్రతిగా మరో పోస్టు చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది పరిశీలించారని, త్వరలో పూర్తి వివరాలు వస్తాయని మరోసారి విశ్వజిత్‌ ట్వీట్‌ చేశారు. మరో వైపు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా సమాధానమిస్తూ.. ఈ అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చా మని విజిలెన్స్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ పేర్కొన్నారు. సదరు యువతి చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందించారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో ఈ ట్విట్టర్‌ సమరం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ సామాన్యురాలు సంధించిన ప్రశ్నకు ఉన్నతాధికారులతో పాటు కేటీఆర్‌ కూడా స్పందించడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top