మాతృభాషకు ప్రాధాన్యం తెలుగు వికీపీడియా సదస్సు–2020లో వక్తలు

Wikipedia Content From Indian Perspective Needed Says Prof.Mamidi Harikrishna - Sakshi

రాయదుర్గం: విజ్ఞానమంతా ఆంగ్లంలోనే నిక్షిప్తమై ఉందని, దాన్ని అనువదించి భవిష్యత్తు తరాలకు అందించాలంటే మాతృభాష తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని వికీపీడియా సదస్సు–2020లో వక్తలు అభిప్రాయపడ్డారు. వికీపీడియాలో ప్రస్తుతం దాదాపు 72 వేల వరకూ ఉన్న వ్యాసాలను ఏడు లక్షలకు పెంచాలని సదస్సులో తీర్మానించారు. గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌లోని కోహ్లీ సెంటర్‌ ఆన్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ (కేసీఐఎస్‌) ఆడిటోరియంలో శనివారం ‘ప్రాజెక్ట్‌ తెలుగు వికీ’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. వికీపీడియాలో వ్యాసాలు పెంచడం కోసం ప్రత్యేక యంగ్‌ బ్రిగేడ్‌ను తయారు చేసేందుకు ట్రిపుల్‌ఐటీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.

సాంస్కృతిక శాఖ ద్వారా అనేక చారిత్రక, భాషా, పండుగల కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటుతున్నామని పేర్కొన్నారు. వికీపీడియాలోనే కాకుండా ఎక్కడైనా మాట్లాడే భాష, రాసే భాష వేర్వేరుగా ఉండాలని అనుకుంటారనీ, కానీ మాట్లాడే భాషలోనే రాయడం మంచిదని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. సాంకేతిక విజ్ఞానం పెరగడంతో మనిషి మేధస్సు పెరిగినా మనస్సు మాత్రం పెరగడం లేదని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం డిజిటల్‌ లిటరసీ సమస్య ఉందని, వికీపీడియాలో ఏడు మిలియన్ల ఇంగ్లిష్‌ వ్యాసాలుంటే అవి అమెరికా, యూరోప్‌ వాళ్లు రాసినవేనని ట్రిపుల్‌ఐటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు.

వికీపీడియాపై ఉచిత శిక్షణ
ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఉచితంగా ప్రతీ శుక్రవారం వికీథాన్‌ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, ప్రతీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వికీపీడియాపై శిక్షణ నిర్వహిస్తున్నామని ట్రిపుల్‌ఐటీ ఆర్‌ అండ్‌ డీ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ వాసుదేవవర్మ చెప్పారు. తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్య గణనీయంగా òపెంచేందుకు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు తెలుగు వికీ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీజేనారాయణన్‌ తెలిపారు. ఈ సదస్సులో ఇంకా ట్రిపుల్‌ఐటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు శ్రీనిరాజు, వెంకటేశ్వర్లు, దిలీప్‌కొణతం, ప్రవీణ్‌ గరిమెల్ల, ప్రాజెక్టు తెలుగు వికీ బృందం, పలువురు మేధావులు, ట్రిపుల్‌ఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top