మా బతుకులు మార్చే వారికే ‘ఓటు’

Who Changed Our Lives Vote For That Leaders - Sakshi

 సాక్షి,కామారెడ్డి : ‘గత 25 సంవత్సరాలుగా ఓటు వేస్తునే ఉన్నా.. ఎందరో నాయకులు మారుతున్నారు.. జెండాలు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ మా బతుకులు మాత్రం మారుతలేవు’ అంటూ కామారెడ్డికి మోచీ కులస్తుడు సాయినాథ్‌ వినూత్నంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రహదారి పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న గంట సాయినాథ్‌.. తన ఆవేదనను ఓ బోర్డు రూపంలో నేతలకు విన్నవిస్తున్నాడు. రోడ్డు మీద ఉన్న తమ బతుకులు మార్చే వారికి ఓటు వేస్తానని బోర్డు ఏర్పాటు చేశాడు.

టెండర్‌ ఓటు అంటే ? 

సాక్షి,కామారెడ్డి అర్బన్‌: మీరు ఓటేయడానికి ఎంతో ఉత్సాహంతో పోలింగు స్టేషన్‌కు వెళ్తారు.. కానీ అప్పటికే మీ ఓటు ఎవరో వేసేసి ఉంటారు. మీరు శాపనార్థాలు పెట్టుకుంటూ బయటకు రావొద్దు. మీ వేలికి ఓటేసిన సిరా గుర్తు లేదు కదా..! అప్పుడు మీరు ప్రిసైడింగ్‌ అధికారికి మీ ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం ఆమోదించిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డు చూపి తాను కచ్చితంగా ఓటు వేస్తానని డిమాండ్‌ చేయవచ్చు. ప్రిసైడింగ్‌ అధికారి నీవే అసలు ఓటరని నిర్ధారణ చేసుకుంటారు. మీకు ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు. కానీ ఓటింగ్‌ యంత్రంపై కాదు. అప్పుడు బ్యాలెట్‌ పేపరు ఇస్తారు. దానినే టెండర్‌ ఓటు అంటారు.

  •  టెండర్‌ బ్యాలెట్‌ పేపర్లు కూడా ఎన్నికల నియమం 49 పి ప్రకారం మామూలు బ్యాలెట్‌ పేపరులాగే వుంటుంది. ఓటింగ్‌ యంత్రంపై ఉండే బ్యాలెట్‌ యూనిట్‌లో ప్రదర్శితమయ్యే అన్ని గుర్తులు ఉంటాయి. 
  •  ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు 20 బ్యాలెట్‌ పేపర్లను సరఫరా చేస్తారు. 
  •  ఏదైనా స్టేషన్‌లో 20 కన్నా ఎక్కువ టెండర్‌ ఓట్లు అవసరమైతే వెంటనే జోనల్‌ అధికారి ద్వారా రిటర్నింగ్‌ అధికారులు బ్యాలెట్లను ప్రిసైడింగ్‌ అధికారి సరఫరా చేస్తారు.
  •  టెండర్‌ బ్యాలెట్‌ పేపరు వెనుక స్టాంపు లేకుంటే చేతిరాతతో ప్రిసైడింగ్‌ అధికారి టెండర్‌ బ్యాలెట్‌ అని రాయాల్సి ఉంటుంది. 
  •  ఫామ్‌–17బీలో టెండర్‌ బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రాయాలి. ఓటరుకు బ్యాలెట్‌ పేపరు ఇవ్వడానికి ముందుగా కాలమ్‌–5లో ఓటరు సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. 
  • టెండర్‌ బ్యాలెట్‌ పేపరుతో పాటు బాణం క్రాస్‌మార్క్‌ ఉన్న రబ్బరు స్టాంపు ఓటరుకు ఇస్తారు.
  •  టెండర్‌ బ్యాలెట్‌ పేపరు, రబ్బరు స్టాంపు తీసుకున్న ఓటరు గదిలోకి వెళ్లి తాను ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా స్టాంపుతో మార్కు చేసి మడత పెట్టి ప్రిసైడింగ్‌ అధికారికి అందజేయాలి. 
  •  ప్రిసైడింగ్‌ అధికారి దానిని ఒక కవరులో భద్రపరిచి వివరాలను ఫారం 17–బీలో రాసుకుంటారు.
  •  అంధత్వం, ఇతర ఇబ్బందుల వల్ల ఇతరుల సహాయం లేకుండా ఓటు వేయలేని పరిస్థితి ఉంటే తమ వెంట సహాయకుడ్ని వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top