తాగడానికి గుక్కెడు నీరు కరువాయే..

Water Crisis Strike Nancharla Villagers,Mahabubnagar - Sakshi

వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు 

వేసవికిముందే తాగునీటికి విలవిల 

సమస్యలు పట్టించుకోని  ప్రత్యేకాధికారులు 

సాక్షి, గండేడ్‌: వేసవి రాకముందే పల్లెల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి మొదలయింది. ఏటా మే, జూన్‌ నెలల్లో తాగునీటి సమస్య ప్రారంభమయ్యేది. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో భూగర్భజలాలు తగ్గిపోయి తాగునీటికి తీవ్ర సమస్యలు మొదలయ్యాయి. మండలంలోని 24 పాత గ్రామ పంచాయతీలు ఉండగా మరో 25 నూతన గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. అలాంటి గ్రామ పంచాయతీల్లో సహితం తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.

మండలంలోని నంచర్ల, కొంరెడ్డిపల్లి, దేశాయిపల్లి, జూలపల్లి, రుసుంపల్లి, వడ్డెగుడిసెలు, గండేడ్‌ తదితర గ్రామాల్లో మాత్రం తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో తాగునీటికోసం కాలనీల్లో ఎన్నో బోర్లు వేసినా వాటిలో నీరులేక ఎండిపోయాయి. మండలంలో 150కి పైగా త్రీఫేజ్‌ బోరుమోటార్లు ఉండగా వాటిలో సగానికి పైగా నీరులేక పనిచేయడంలేదు.

 ఆయా గ్రామాల్లో సుమారు 400లకు పైగా సింగిల్‌ఫేజ్‌ బోరుమోటార్లు ఉండగా వాటిలో 250లోపు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు కలగడంతో వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎంతోదూరం వెళ్లి తాగునీరు, వినియోగించేందుకు తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నారు.  

పట్టించుకోని అధికారులు, కార్యదర్శులు 
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి మూడునెలలు గడుస్తున్నా.. సంబంధిత ప్రత్యేక అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు చూసిన పాపానపోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇక గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామ కార్యదర్శి దగ్గరుండి చేయించాల్సిందిపోయి వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ డబ్బులు లేవని తేల్చిచెబుతున్నారు.

   ముఖ్యంగా ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య వచ్చిన వెంటనే దగ్గరుండి పరిష్కరించలేక నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. తాగునీటి సమస్య ఉన్నచోట వ్యవసాయ బోర్లనుంచి, ట్యాంకర్ల ద్వారా గాని తాగునీరు అందించక విఫలమవుతున్నారని ప్రజలు తెలిపారు. పలుగ్రామాల ప్రజలు మాత్రం గండేడ్‌ కార్యాలయానికి చేరుకుని తీవ్ర నిరసన తెలిపినా, రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టిన్నా గ్రామ కార్యదర్శులు స్పందించడం లేదు. 

సమస్యలు పరిష్కరిస్తాం 
మండలంలో ఏఏ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ట్యాంకర్ల ద్వారా, బోర్లు లీజుకు తీసుకొని నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. నెలరోజుల్లో మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దీం తో గ్రామాల్లో తాగునీటి సమస్య దూరమవు తుంది. చిన్న చిన్న మరమ్మతులు వస్తే సం బంధిత గ్రామ కార్యదర్శులు పరిష్కరించాలి. 
– దివ్యసంతోషి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, గండేడ్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top