అవకాశాలను అందిపుచ్చుకోండి 

venkaiah naidu in gitam university - Sakshi

గీతం స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచీకరణతో వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విద్యను ఉపాధి మార్గంగా కాకుండా సాధికారత సాధించే సాధనంగా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ (హైదరాబాద్‌) ఎనిమిదో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో వృత్తి నైపుణ్యాలకు కొదవలేదని, నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు అన్నివర్గాల వారు ప్రయత్నించాలన్నారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి తాను వ్యతిరేకం కాదన్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చదువుకుని, సంపాదించుకుని మాతృదేశా నికి తిరిగి రావాలన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్‌ తెలుగును తప్పని సరి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.  

అందరికీ ఉద్యోగాలు అసాధ్యం: మంత్రి హరీశ్‌రావు 
ఒకటిన్నర నుంచి 3% మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలుగు విద్యార్థులు అఖిల భారత సర్వీసుల్లో ఎక్కువ సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు. మిషన్‌ భగీరథ, విద్యుత్, మిషన్‌ కాకతీయ, హరితహారం తదితర పథకాల ద్వారా ప్రభుత్వం తాగునీరు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేసిందన్నారు. పర్యావరణ మార్పులపై యువ ఇంజినీర్లు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని పిలుపునిచ్చారు. గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ ఎం.ఎస్‌. ప్రసాదరావు వార్షిక నివేదిక సమర్పించగా, చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.రామకృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గీతం వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి, మాజీ ఎంపీ కేఎస్‌ రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top