వేద పండితుల మంత్రోచ్చారణలు... విరాటపర్వం పారాయణం... హనుమాన్ చాలీసా పారాయణం... కలశాభిషేకాలతో వరుణ జపం ఘనంగా నిర్వహించారు.
చిలుకూరు (మొయినాబాద్): వేద పండితుల మంత్రోచ్చారణలు... విరాటపర్వం పారాయణం... హనుమాన్ చాలీసా పారాయణం... కలశాభిషేకాలతో వరుణ జపం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో పన్నెండమంది వేదపండితులతో గురువారం ఆలయ సమీపంలోని గండిపేట చెరువులో వరుణ జపం చేపట్టారు.
ఉదయం 10 గంటలకు కలశాల్లో స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకువెళ్లి చెరువులో కలిపి వరుణ జపం ప్రారంభించారు. నాభి (నడుము భాగం) వరకు నీటిలో నిల్చుని పన్నెండు మంది వేదపండితులు మంత్రోచ్చారణలతో మధ్యాహ్నం 12 గంటల వరకు వరుణ జపం చేశారు. నూటా ఎనిమిదిసార్లు (11 ఆవృతులు) వరుణ దేవు ణ్ని ప్రార్థిస్తూ మంత్రాలు జపించారు. అనంతరం చెరువులో నుంచి కలశాన్ని తీసుకువచ్చి గరుత్మంతుడికి అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా భక్తులు సైతం వరుణ జప మంత్రాల్ని అనుకరించారు. చిలుకూరు బాలాజీ దేవాల యంలో ప్రదక్షిణలు చేసే భక్తులు వర్షాలకోసం అదనంగా రెండు ప్రదక్షిణలు చేశారు. వారం రోజుల నుంచి అదనపు ప్రదక్షిణలు కొనసాగుతున్నాయి. వర్షాలు పడే వరకు భక్తులు అదనపు ప్రదక్షిణలు చేయాలని ఆలయ అర్చకులు సూచించారు. వరుణ జపంలో చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, అర్చకులు రంగరాజన్, సురేష్‌స్వామి, వేదపండితులు పాల్గొన్నారు.
అన్ని ఆలయాల్లో పూజలు చేయాలి: సౌందరరాజన్
వర్షాలు లేక దేశం కరువు కోరల్లోకి వెళ్తుందన్న సంకేతాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు ఎక్కడిక్కడ దేవాలయాల్లో పూజలు చేయాలని, వర్షాలకోసం భగవంతున్ని ప్రార్థించాలని చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ సూచించారు. వరుణ జపం అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం చిలుకూరులో వరుణ జపం చేసిన తర్వాతే వర్షాలు బాగా పడ్డాయని, ఆ నీళ్లే ఇప్పటి వరకు ఉన్నాయన్నారు. చిలుకూరు బాలాజీ కరుణతో ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.