ఇక పోటీ చేయను! | v hanumantha rao not to contest in any election | Sakshi
Sakshi News home page

ఇక పోటీ చేయను!

Aug 20 2014 2:18 PM | Updated on Sep 19 2019 8:28 PM

ఇక పోటీ చేయను! - Sakshi

ఇక పోటీ చేయను!

అనుభవమైతేగానీ తత్వం బోధపడదంటారు. క్షవరమైతే వివరం రాదని కూడా కాస్త ఘాటుగా వాత పెడతారు.

అనుభవమైతేగానీ తత్వం బోధపడదంటారు. క్షవరమైతే వివరం రాదని కూడా కాస్త ఘాటుగా వాత పెడతారు. విషయం చెప్పకుండా ఇదంతా ఎందుకంటారా. కాంగ్రెస్ కమిటెడ్ వర్కర్ హనుమంతన్న యమ సీరియస్ గా ఓ ప్రకటన చేశారు. జీవితంలో ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు.

హస్తం పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ హనుమంతరావు అధిష్టానమ్మ చల్లని చూపుకు పాత్రులయ్యారు. మేడమ్ కరుణాకటాక్షాలతో పెద్దలసభ సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. సోనియమ్మ కుటుంబంపై ఈగ వాలకుండా కాచుకుంటూ తన పదవి ఎసరు రాకుండా కాలం నెట్టుకొస్తున్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు అంబర్పేటలో రంగంలోకి చేయి కాల్చుకున్నారు. కాషాయం పార్టీ దెబ్బకు కంగుతిన్నారు.

సొంత నియోజకవర్గంలోనే తల బొప్పి కట్టడంతో వీహెచ్కు తత్వం బోధపడింది. అంబర్పేటలో ఓటమి తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని హనుమన్న ప్రకటించారు. చివరివరకూ పార్టీకి సేవ చేస్తూ ఉండిపోతానని స్వామి భక్తి చాటుకున్నారు. అయితే మాటకు కట్టుబడతారా, అధిష్టానం ఆదేశిస్తే మాట వెనక్కు తీసుకుంటారా అనేది కాలమే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement