రూ.80 కోట్లు దోచుకున్నారు

Uttam Fire On TRS Government - Sakshi

పాస్‌పుస్తకాల ముద్రణలో భారీ కుంభకోణం 

సీఎం చెప్పిన భద్రతాప్రమాణాలు లేకుండా నాసిరకంగా తయారీ

న్యాయ విచారణ జరపాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రైతు పాస్‌పుస్తకాల ముద్రణలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, రూ.80 కోట్ల దోపిడీ జరిగిందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బతుకమ్మ చీరల తరహాలో జరిగిన ఈ కుంభకోణంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత భద్రతాప్రమాణాలతో పాస్‌పుస్తకాలను ముద్రిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ భద్రతా ప్రమాణాలు లేకుండానే నాసిరకం పుస్తకాలను ముద్రిస్తున్నారని విమర్శించారు.

ఈ పుస్తకాల ముద్రణ టెండర్లను ప్రభుత్వ ప్రెస్‌లకు కాకుండా పనికిరాని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారని, నాలుగు కంపెనీల్లో రెండింటిపై ఇదివరకే అనర్హత వేటు పడిందని పేర్కొన్నారు. 26 భద్రతా ప్రమాణాలతో, వాటర్, ట్యాంపర్‌ ప్రూఫ్‌ పుస్తకాలను ఇస్తామని కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పారని, ఇప్పుడు ఆ ఫీచర్లను 18కి కుదించారని, ఏ ప్రూఫ్‌కు దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఈ పాస్‌పుస్తకాల కోసం రైతుల నుంచి రూ.160 వసూలు చేస్తున్నారని, కానీ, ఈ పుస్తకాలను బయటి ప్రింటర్లు రూ.50కే ఇస్తామని చెబుతున్నారని అన్నారు. ఇలా 71 లక్షల పాస్‌పుస్తకాల ముద్రణకుగాను రూ.80 కోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

పాస్‌పుస్తకాల భద్రతా ప్రమాణాలపై రాజీపడొద్దని, ఈ విధంగా పుస్తకాలను ముద్రిస్తే నకిలీవి పుట్టుకొస్తాయని, ఫోర్జరీ అవుతాయని, అలా జరిగితే తమకు సంబంధం లేదని మింట్‌ కాంపౌండ్‌ ప్రెస్‌ అధికారులు చెప్పారని ఉత్తమ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశాలకు ప్రెస్‌ జనరల్‌ మేనేజర్‌ రమాకాంత్‌ దీక్షిత్‌ హాజరయ్యారని, ఆయన పేరిట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారని, తాము ముద్రణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారని తెలిపారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలన్నీ, ఈ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శించారు. ఈ కుంభకోణంపై న్యాయవిచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top