జాతీయ రహదారులకు నిధులివ్వండి 

TRS MPs asks Gadkari for Funds to the National Highways - Sakshi

కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు 

తెలంగాణలో ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీలతో గడ్కరీ ప్రత్యేక చర్చ 

తమ ప్రతిపాదనలు సమర్పించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎంపీలు 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేసి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించేందుకు గడ్కరీ సోమవారం పార్లమెంటులో తెలంగాణ ఎంపీలకు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు వెంకటేశ్‌ నేత, శ్రీనివాస్‌రెడ్డి, రాములు ఆయన్ను కలసి రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ ప్రతిపాదనలతో వినతిపత్రాన్ని సమర్పించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి నిర్మాణం చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో 3,155 కి.మీ మేర కేంద్రం జాతీయ రహదారులను నిర్మించాల్సి ఉన్నా ఇప్పటికీ కేవలం 1,388 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే గుర్తించారని వివరించారు. ఇంకా 1,767 కిలోమీటర్ల రహదారులను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు.  

ప్రధాన ప్రతిపాదనలు.. 
ఎంపీలు చేసిన ప్రధాన ప్రతిపాదనలు ఇలా.. హైదరాబాద్‌లోని గౌరెల్లి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ జంక్షన్‌– వలిగొండ– తొర్రూర్‌–నెల్లికుదురు–మహబూబాబాద్‌–ఇల్లందు–కొత్తగూడెంలోని ఎన్‌హెచ్‌–30 మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. మెదక్‌–ఎల్లారెడ్డి– రుద్రూర్‌ మార్గాలను అదే తరహాలో గుర్తించాలి. బోధన్‌–బాసర–బైంసా మార్గాన్ని, మెదక్‌– సిద్దిపేట్‌–ఎల్కతుర్తి మార్గాలను సైతం గుర్తించాలి. చౌటుప్పల్‌–షాద్‌నగర్‌–కంది మార్గాలను దక్షిణ ప్రాంత రీజినల్‌ రింగ్‌ రోడ్డుగా గుర్తించాలి. ఉత్తర ప్రాంత రీజినల్‌ రింగ్‌ రోడ్డు అయిన సంగారెడ్డి–నర్సాపూర్‌–తూప్రాన్‌–గజ్వేల్‌–భువనగిరి–చౌటుప్పల్‌ మార్గాన్ని దక్షిణ ప్రాంత రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానం చేయాలి.  

ఎన్‌హెచ్‌లుగా గుర్తిస్తూ గెజిట్‌ జారీ చేయండి.. 
జాతీయ రహదారుల గుర్తింపు, నిర్మాణంలో రాష్ట్ర వాటాగా భూసేకరణ, నిర్వాసితుల తరలింపు, ఆటవీ భూముల మళ్లింపులో 50 శాతం వ్యయం భరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని గడ్కరీకి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వివరించారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి గెజిట్‌ విడుదల చేయాలని, వీటి నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేసి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చించిన గడ్కరీ పనుల ప్రారంభంపై ఆదేశాలు జారీచేశారు. 

మళ్లీ టెండర్లు ఆహ్వానించాలి.. 
టీఆర్‌ఎస్‌ ఎంపీల తరువాత కాంగ్రెస్‌ తరఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెళ్లి గడ్కరీని కలిశారు. నకిరేకల్‌–నాగార్జునసాగర్‌ వయా నల్గొండ టౌన్‌ మీదుగా వెళ్లే లైను 2014లో ప్రారంభమైతే ఇప్పటికీ పనులు పూర్తికాలేదని, కాంట్రాక్టర్‌ పనులు మధ్యలోనే ఆపేశారని గడ్కరీకి కోమటిరెడ్డి వివరించారు. దీనివల్ల ఈ లైన్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల 60–70 మంది చనిపోయారని, ఈ లైను పనులకు కొత్త టెండర్లు పిలవాలని స్థానిక అధికారులను కోరినా వారు పట్టించుకోలేదన్నారు. దీనిపై గడ్కరీ స్పందించి 20–30 రోజుల్లో కొత్త టెండర్లు పిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు. ఒకవేళ టెండర్లను పిలవకపోతే అధికారులతోపాటు తనపై కూడా కేసు పెట్టాలని గడ్కరీ చెప్పారన్నారు. దీనికి ఆయన్ను అభినందించాలన్నారు. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని ఎల్‌బీ నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు 8 లేన్ల రహదారిగా మార్చేందుకు అవసరమైన రూ. 300 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top