లోక్‌సభ స్థానాలు కైవసానికై అమాత్యులు గురి..

Trs Leaders Target On Loksabha Seats - Sakshi

ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడంపై అమాత్యులు గురిపెట్టారు. అధినేత కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చేందుకు రాష్ట్రమంత్రులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో పార్టీ ఖాతాలో ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలను తిరిగి సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు చేపట్టిన రాష్ట్రమంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ పార్టీ అభ్యర్థులను విజయంవైపు నడిపిస్తున్నారు.

సాక్షి మంచిర్యాల: ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతను నిర్మల్‌ జిల్లాకు చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్‌ అప్పగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడెం నగేష్‌ను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న ఐకే.రెడ్డి పార్టీ కేడర్‌ను సమాయత్తపరుస్తూ ముందుకు కదులుతున్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. దీంతో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా టీఆర్‌ఎస్‌ చేతికి వెళ్లాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూనే.. మంత్రి ఐకే.రెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సమన్వయ, ప్రచార బాధ్యతలను పూరి ్తగా చేపట్టిన ఆయన పార్టీని ఏకతాటిపై నడిపిం చేందుకు ప్రయత్నిస్తున్నారు. కచ్చితంగా ఆది లాబాద్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టిపోటీ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి రమేష్‌ రాథోడ్, బీజేపీ నుంచి సోయం బాపురావు బరిలో ఉన్నారు. లం బడా తెగకు చెందిన రమేష్‌ రాథోడ్‌.. ఆదివాసీకి చెందిన సోయం బాపురావు బలమైన అభ్యర్థులు కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. 

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేపట్టారు. కేసీఆర్‌ ఆదేశంతో పెద్దపల్లి అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌ విజయానికి ఈశ్వర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీలకు మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో.. పెద్దపల్లి, రామగుండం, మంథని పెద్దపల్లి జిల్లాలో.. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో ఉన్నా యి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో మంథని, రామగుండం స్థానాలను టీఆర్‌ఎస్‌ కోల్పోయింది. ధర్మపురి, మంచిర్యాల, పెద్దపల్లిల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఆ తరువాత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో బలం మరింత పెరిగింది.

ఇప్పుడు ఒక్క మంథని మినహా మిగిలిన ఆరుస్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒకమాజీ ఎమ్మెల్యేతో కలిసి కొప్పుల ఈశ్వర్‌ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. స్వయంగా ప్రచార  బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు.. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను సమన్వ యం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. మాజీ ఎంపీ జి.వివేక్‌కు పార్టీ టికెట్‌ నిరాకరించడంతో  నెలకొన్న పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఆ సమస్యను అధిగమించడానికి వివేక్‌ లక్ష్యంగా కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్‌ మాటలతూటాలు ఎక్కుపెట్టారు. వివేక్‌ అనుచరులను పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మళ్లించడానికి కొప్పుల పావులు కదుపుతున్నారు. ఏదేమైనా ఆదిలాబాద్, పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను చేపట్టిన అమాత్యుల మంత్రాంగం ఏ మేరకు ఫలించనుందో వేచిచూడాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top