నూటొక్క తీరు.. శ్రేణుల హోరు

TRS activists march from various constituencies to pragathi nivedhana sabha - Sakshi

పలు నియోజకవర్గాల నుంచి పాదయాత్రగా వచ్చిన శ్రేణులు.. 

కిక్కిరిసిన కొంగర కలాన్‌.. మైదానంలో సందడే సందడి..

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చీమలదండు కదలింది. లక్షలాదిగా తరలివచ్చిన గులాబీ దళంతో కొంగర కలాన్‌ జనసంద్రమైంది. గులాబీ జెండాల రెపరెపలు.. కళాకారుల ఆట పాటలు.. యువత కేరింతలు.. జై కేసీఆర్‌.. జై తెలంగాణ నినాదాలతో ప్రగతి నివేదన సభ మైదానం హోరెత్తింది. ఉప్పొంగిన ఉత్సాహంతో తరలివచ్చిన వేలాది వాహనాలు, టీఆర్‌ఎస్‌ అభిమానులతో పరిసరాలు నిండిపోయాయి. ప్రత్యేక వేషధారణలతో కళాకారులు, బతుకమ్మలను ఎత్తుకున్న మహిళలు, కోలాటాల బృందాల ఆట పాటలు అలరించాయి. సభా స్థలికి రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేసినా.. రెట్టించిన ఉత్సాహంతో ఉదయమే రైతులు, యువకులు, మహిళలు, ఆశా వర్కర్లు సభ ప్రాంగణానికి చేరుకున్నారు.

రాత్రి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు
సభాస్థలికి తరలివస్తున్న జనంలో ఉత్సాహాన్ని నింపేందుకు శనివారం రాత్రి నుంచే సాంస్కృతిక కార్య క్రమాలు మొదలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదిక ముందున్న ప్రాంత మంతా కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలు మూలల నుంచి కార్యకర్తలు, నాయకులు, అభి మానులు పెద్ద సంఖ్యలో  తరలివచ్చారు. జనసం దోహాన్ని ఉత్సాహంతో ఉంచేందుకు కళాకారులు ఆటపాట లతో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని పాటల రూపంలో ప్రదర్శించారు. కళా కారుల ప్రదర్శనకు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈలలు, కేరింతలతో ప్రతిస్పందించడంతో అక్కడి వాతావరణం ఉల్లాస భరితంగా మారిపోయింది. కొందరు కార్యకర్తలు ఏకంగా స్టెప్పులు వేయడంతో వారికి జతగా మరికొందరు అదేస్థాయిలో నృత్యాలు చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో లబ్ధిపొందిన రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 10 వేలకు పైగా ట్రాక్టర్లలో ఒకరోజు ముందే సభా స్థలికి వచ్చి వంటావార్పు చేసుకొని సభకు హజరయ్యారు. వారికి పార్టీ వలంటీర్లు వంట చెరుకు అందించడంతో పాటు పొయ్యిలు ఏర్పాటు చేసిచ్చారు.

జనమే జనం
రాజధాని శివారు ప్రాంతాల్లోని శామీర్‌పేట్, పటాన్‌ చెరు, శంషాబాద్, హయత్‌నగర్, ఘట్‌కేసర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలు, మోటారు సైకిళ్లలో భారీ ఎత్తున జనం కొంగరకలాన్‌కు చేరుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి యువత మోటారు సైకిళ్లతో ర్యాలీలుగా తరలివచ్చారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పాదయాత్రగా సభాస్థలికి చేరుకున్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత రాకకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనప్రవాహం పెరుగుతూ వచ్చింది. దీంతో వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరిగి ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైంది. కొన్ని చోట్ల ట్రాఫిక్‌ పోలీసులు రద్దీని నియంత్రించ లేక చేతులెత్తేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వలంటీర్లు ముందుకు వచ్చారు.

బస్సు టాపులపై నిల్చొని..సభా స్థలికి వెళ్లే మార్గాలన్నీ 
జన సమ్మర్థంతో కిక్కి రిసిపోగా.. వేలాదిగా తరలివచ్చిన వాహనాలతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన కార్యకర్తలు సభా ప్రాంగణానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఏకంగా ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచే వెనుదిరగగా.. మరికొందరు బస్సు టాపులపై నిల్చొని సీఎం కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

చిటపట చినుకులు
సభకు వర్షం అంతరాయాన్ని కలిగించింది. మధ్యాహ్నం తర్వాత రెండు మూడుసార్లు చినుకులు కురిశాయి. ఓ సమయంలో మోస్తరు వర్షం కురవడంతో సభకు వచ్చిన జనం అటు, ఇటు పరుగులు తీశారు. భారీ వర్షం వచ్చే సూచనలు ఉందన్న ప్రచారంతో కొందరు వచ్చిన వెంటనే వెనుదిరిగారు. 

మహిళల సందడే సందడి
సభలో ఏర్పాటు చేసిన 16 గ్యాలరీల్లో మహిళల సందడి అంతాఇంతా కాదు. సభావేదిక ముం దున్న గ్యాలరీలో కళాకారుల ఆటపాటలకు అను గుణంగా 2 వేల మంది స్టెప్పులేశారు. యువత కేరిం తలతో, డ్యాన్సులతో హోరెత్తించారు. పలువురు మహిళలు బతుకమ్మలు, బోనా లతో తరలివచ్చారు. అక్కడే బృందాలుగా ఏర్పడి బతుకమ్మ పాటలతో ఆటలాడారు. వారికనుగుణంగా యువతులు గొంతు కలిపారు.

దోబూచులాడిన వరుణుడు..
ప్రగతి నివేదన సభకు వరుణుడు కొంత అంతరాయాన్ని కలిగించాడు. శనివారం మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం రాత్రి సభ పరిసరాల్లో భారీ వర్షమే కురిసింది. పెద్ద ఎత్తున గాలితో కూడిన వర్షం రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు కుప్పకూలాయి. సభా ప్రాంగణంలోని ప్లెక్సీలు పడిపోగా... నేలంతా తడిసి చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో తేరుకున్న నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఆదివారం ఉదయం పొడి వాతావరణం ఉన్నప్పటికీ... మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లుతో మొదలై ఓ మోస్తరు వాన కురిసింది. దీంతో సభకు వచ్చే జనాలకు ఇబ్బందులు తప్పలేదు. పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులకు కాస్త అంతరాయం కలిగింది. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. వాతావరణం పొడిగా మారడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే సమయానికి పరిస్థితి పూర్తిగా సర్దుకుంది. 

అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు 8 వైద్య శిబిరాలు, 30 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.కార్యకర్తల్లో సెల్ఫీ జోష్‌ కనిపించింది. సభకు వచ్చిన వారంతా సెల్ఫీలు తీసుకుని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్‌ చేయడం కనిపించింది. సాయంత్రం ఐదున్నరకు బతుకమ్మలు, బోనాలతో మహిళలు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు సభాస్థలి దృశ్యాలను ఎంపీ కవిత ఫొటో తీసుకున్నారు.హెలికాప్టర్‌ నుంచి సభా ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్‌ వీక్షించారు. కేడర్‌కు అభివాదం చేశారు. కార్యకర్తలు కూడా ‘జై కేసీఆర్‌’ అని నినాదాలు చేయడంతో సభా ప్రాంగణమంతా మార్మోగింది. 
ఆ దృశ్యాలను కవిత సహా కార్యకర్తలు కెమెరాల్లో బంధించుకున్నారు.6 గంటలకు సభాస్థలికి చేరుకున్న కేసీఆర్‌.. అమరులకు నివాళులర్పించారు. మంత్రి మహేందర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రసంగం మొదలైంది.

ప్రగతి భవన్‌కు బస్సులో సీఎం
శంషాబాద్‌: ప్రగతి నివేదన సభకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. సభ ముగిసే సమయానికి పూర్తిగా చీకటిపడింది. దీంతో హెలికాప్టర్‌ ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో ఆయన బస్సులో కొంగరకలాన్‌ నుంచి వయా శంషాబాద్‌ మీదుగా ప్రగతి భవన్‌కు బయలుదేరారు. దీంతో పోలీసులు రహదారి గుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంతోపాటు పలువురు ప్రముఖులు, మంత్రులు కూడా అందులోనే బయలుదేరారు. 

‘ప్రగతి నివేదన’లో అన్నీ తామై..
సాక్షి, హైదరాబాద్‌: కొంగర కలాన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ సజావుగా జరగడం, వేదిక నిర్వహణలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్‌లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సభా వేదిక ఏర్పాట్లు, సాంస్కృ తిక కార్య క్రమాలు, సభికులకు అవసరమైన మంచినీళ్లు, టాయి లెట్ల ఏర్పాటు, పోలీసు బందోబస్తు ఇలా అన్నీ తామై పర్యవేక్షించారు. వీరిద్దరూ ఆదివారం ఉదయంనుంచీ సభా ప్రాంగణంలో అందరినీ సమన్వయం చేస్తూ ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూశారు. వలంటీర్లను అందుబాటులో ఉంచడం, ట్రాఫిక్‌ పోలీసులు, కళాకారు లను సమన్వయ పరుస్తూ కనిపించారు. ఇక సభ మొదలైన సమయం నుంచీ సభకు వస్తున్న మహిళలు, యువకులకు సూచనలు చేయడం, బారికేడ్లు దాటకుండా, కరెంట్‌ స్తంభాలు, కటౌట్లు ఎక్క కుండా బొంతు సూచనలు చేశారు. ఎవరైనా తప్పిపోతే వారికి సంబంధించి  సమాచారం ఇచ్చారు. మరోవైపు ఎంపీ సుమన్‌ సభా ప్రాంగణం దగ్గరికి వస్తున్న నేతలు, ప్రజలను ఆహ్వానించారు. డోలు వాయిస్తూ ఉత్సాహపరిచారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ నుంచీ సభ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలను మినహాయించారు. దీంతో వారిద్దరూ ఉదయం నుంచీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వలంటీర్ల స్వచ్ఛంద సేవ..
సాక్షి, హైదరాబాద్‌: ప్రగతి నివేదన సభకు భారీగా జనం వస్తారని ముందే ఊహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేసింది. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసే బాధ్యత వలంటీర్లకు అప్పగించింది. మంచినీటి సరఫరా, భోజన సదుపాయాల కల్పన, టాయిలెట్ల నిర్వహణలో వీరి పాత్ర కీలకంగా మారింది. దాదాపు నాలుగు వందల మంది వలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం ముందు రోజే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ తదితర జిల్లాల నుంచి ట్రాక్టర్లలో వచ్చిన రైతులు, అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. శనివారం రాత్రి భోజన ఏర్పాట్లు మొదలు ఆదివారం మధ్యాహ్న భోజనం, నీళ్ల ప్యాకెట్లు, బాటిళ్ల పంపిణీ తదితర కార్యక్రమాలన్నీ వలంటీర్లే చూసుకున్నారు. సభ ముగిసి కార్యకర్తలు, అభిమానులు తిరిగి వెళ్లిపోయేవరకు వలంటీర్లు అక్కడ ఉండి పనులు పూర్తిచేశారు.

ఎమ్మెల్సీ రాములునాయక్‌ రొట్టెల పంపిణీ 
ఇబ్రహీంపట్నం: ప్రగతి నివేదన సభకు వచ్చే కార్యకర్తలకు ఎమ్మెల్సీ రాములునాయక్‌ రొట్టెలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణానికి సమీపంలో ప్రత్యేకంగా గిరిజనులను తీసుకొచ్చి అక్కడికక్కడే జొన్నరొట్టెలు తయారు చేయించి వారికి అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆకలితో వచ్చిన కార్యకర్తలు జొన్నరొట్టెలు తిని ఎమ్మెల్సీని అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.  

జనంతో కలసి మంత్రి భోజనం 
ఇబ్రహీంపట్నం జోన్‌ బృందం: టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఒక రోజు ముందుగానే వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై చేరుకున్నారు. వీరికి సభావేదికకు సమీపంలో పార్కింగ్, బస వసతి కల్పించారు. శనివారం రాత్రి అక్కడే బస చేసిన వారు ఆదివారం తెల్లవారుజామున పార్కింగ్‌ స్థలం వద్దే స్నానాలు చేశారు. ఈ క్రమంలో ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటు చేసిన వసతి వద్ద రోడ్డు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్వయంగా వడ్డించి తను కూడా వారితో కలసి అక్కడే భోజనం చేశారు. 

భోజనం కోసం పోలీసుల తంటాలు 
ప్రగతి నివేదన సభ బందోబస్తులో రెండు రోజులుగా ఉన్న పోలీసులు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభా ప్రాంగణం వద్దకు వారి కోసం భోజనం ప్యాకెట్లు తీసుకొచ్చిన వాహనం వచ్చింది. పోలీసులు ప్యాకెట్ల కోసం ఎగబడుతూ తీవ్ర తంటాలు పడ్డారు. 

- వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చిన కొందరు కార్యకర్తలు దారితప్పిపోయారు. వాహనాలు ఓచోట, వీరోచోట ఉండటంతో 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. 
- సభకు వచ్చిన కార్యకర్తలు చాలా మంది ఆకలికి అలమటించారు. కార్యకర్తలు ఓ చోట ఉండటం.. వంటలు మరోచోట చేయడంతో అందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. చిరుతిళ్లు, మంచినీటితో సరిపెట్టుకున్నారు.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమ యంలో రెండు దఫాలుగా వర్షం కురవ డంతో జనం ఉరుకులు పరుగులు తీశారు.
- ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్ల వెంట ఉన్న హోటళ్లు, టీ స్టాళ్లను పోలీసులు మూసివేయించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని, ఆ రోడ్ల వెంట వీఐపీలు వస్తున్నారని చెప్పి మూసేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. - సభకు వచ్చే జనాల కోసం భారీగా వాటర్‌ బాటిళ్లు స్టాక్‌ చేసుకున్నామని.. పోలీసుల నిర్వాకంతో అమ్మలేకపోయామని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తడంతో చాలా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా మంది సభకు నడుచుకుంటూ వెళ్లగా.. మరికొందరు వెళ్లలేక వాహనాల్లోనే ఉండిపోయారు.
- ఒక్కసారిగా పార్కింగ్‌ స్థలాలకు వాహనాలు బారులుదీరడంతో అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
- పలువురు నేతలు బల ప్రదర్శన చేశారు. డీజే సౌండ్స్‌తో డ్యాన్సులు చేస్తూ ప్రాంగణానికి చేరుకున్నారు. 
- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలు బైక్‌ ర్యాలీతో ప్రాంగణానికి బయలుదేరడంతో వెనుకొచ్చిన వాహనాలు నెమ్మదిగా ముందుగా కదిలాయి. 
- ఎల్బీనగర్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్‌ కాన్వాయ్‌లో వచ్చిన కార్యకర్తలు బైక్‌లతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న కార్యకర్తలు, ఎదురుగా వస్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. 
- బొంగుళూరు జంక్షన్‌ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి నడుచు కుంటూ వెళ్లడానికి కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 
- మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు 1,000 మంది సైకిళ్లపై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు సైకిళ్లను డీసీఎంలలో పంపారు.
- నాగార్జునసాగర్, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్లు, శ్రీశైలం హైవే ఇతర దారుల వెంట తాత్కాలిక చిరుతిళ్ల కేంద్రాలు వెలిశాయి. మిర్చి, పునుగులు, వడలు, మొక్కజొన్న కంకుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆయా చోట్ల భోజనశాలలూ వెలిశాయి. 
- దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు చెట్ల కింద వంటలు చేసుకుని ఆరగించారు. కొంతమంది ఇళ్ల నుంచే పార్శిళ్లు తెచ్చుకుని తిన్నారు. 
- సభ సందర్భంగా భాగ్యనగరాన్ని గులాబీ జెండాలతో ముస్తాబు చేశారు. సిటీ అలంకరణ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలిపేలా భారీ కటౌట్లు, బెలూన్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
- నకిరేకల్‌ నుంచి 4 రోజుల క్రితం సభకు పాదయాత్రగా బయలుదేరి వచ్చిన టీఆర్‌ఎస్‌వీ నేత కొమ్మనబోయిన సైదులు నేతృత్వంలోని విద్యార్థుల బృందానికి కేటీఆర్‌ ఘన స్వాగతం పలికారు. 
- సభకు హాజరైన మహిళల్లో అనేకమంది కేసీఆర్‌ చిత్రంతో ఉన్న స్టిక్కర్‌లను బొట్టుబిళ్ల, చెవిదిద్దులుగా పెట్టుకుని కనిపించడం ఆకట్టుకుంది.
- ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశానికి కేటీఆర్, మహేందర్‌రెడ్డి హాజరవలేదు. రోజంతా సభాస్థలి వద్దే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
- టీవీ యాంకర్‌ మంగ్లీ సందడి చేశారు. లంబాడీలతో కలసి నృత్యాలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top