పప్పు వచ్చింది..!

Toor dal Ready For Distribution Ration Card Holders - Sakshi

వచ్చే నెల బియ్యంతోపాటు కందిపప్పు పంపిణీ

ఒక్కో రేషన్‌ కార్డుకు కిలో చొప్పున ఉచితంగా..

రేషన్‌ దుకాణాలకు చేరిన 524 మెట్రిక్‌ టన్నులు

ఒకటో తేదీ నుంచి పంపిణీకి ఏర్పాట్లు

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  రేషన్‌కార్డు దారులకు వచ్చేనెలలో కందిపప్పు అంజేయనున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో పేద కుటుంబాలు ఆహారానికి ఇబ్బంది పడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు బియ్యంతోపాటు అదనంగా కిలో చొప్పున కందిపప్పు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలకు సాంత్వన కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌తోపాటు ఈ నెలలోనూ ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున పంపిణీ చేశారు. అలాగే రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందింది. వచ్చేనెలలో బియ్యంతోపాటు కిలో కందిపప్పు కూడా పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 524 మెట్రిక్‌ టన్నుల పప్పు జిల్లాలోని 919 రేషన్‌ దుకాణాలకు చేరుకుంది. 

రెండు నెలలు ఆలస్యంగా..  
వాస్తవంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో రేషన్‌కార్డు దారులకు బియ్యంతోపాటు ఉచితంగా కందిపప్పు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, నాఫెడ్‌ నుంచి సకాలంలో పప్పు సరఫరా కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ఏప్రిల్, మే నెలల కోటా జిల్లాకు చేరలేదు. జిల్లాకు కేటాయించిన 524 మెట్రిక్‌ టన్నుల కోటా రెండు నెలల ఆలస్యంగా తాజాగా జిల్లాకు వచ్చింది. ఈ మొత్తాన్ని ఆయా రేషన్‌ దుకాణాలకు చేరవేశారు. దీన్ని జూన్‌ నెల కోటాగా యంత్రాంగం పరిగణిస్తున్నట్లు తెలిసింది. అయితే ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటా తిరిగి వస్తుందా?రాదా? అనే విషయంపై స్పష్టత లేదు. మొత్తం మీద వచ్చేనెలలో జరగనున్న కందిపప్పు పంపిణీతో జిల్లాలోని 5.24 లక్షల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top