భగ.. భగ.. | temperature increases in summer | Sakshi
Sakshi News home page

భగ.. భగ..

May 24 2014 2:29 AM | Updated on Sep 2 2017 7:45 AM

భానుడి ప్రతాపానికి జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్తగూడెం, న్యూస్‌లైన్: భానుడి ప్రతాపానికి జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు.  గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.  వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తుండడంతో విధులకు వెళ్లేవారు  జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే వేడిగాలులు ప్రారంభమవుతుండడం, మధ్యాహ్నం తీక్షణంగా ఉంటుండడంతో రహదారులు బోసిపోతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వేసవి ధాటికి తట్టుకోలేక వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 జిల్లాలోనే కొత్తగూడెం పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. శుక్రవారం 48.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు వద్ద  50 డిగ్రీలకుపైగానే ఉంటోందని కార్మికులు అంటున్నారు. ఇక పారిశ్రామిక ప్రాంతాలైన పాల్వంచలో శుక్రవారం 47డిగ్రీలు, మణుగూరులో46, ఇల్లెందులో46  డిగ్రీల  ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాచలం, సత్తుపల్లిలో 45 డిగ్రీలు, ఖమ్మంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత  నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే మరోరెండురోజులలో ప్రారంభమయ్యే రోహిణికార్తెలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

 వాతావరణ మార్పులతో అనారోగ్యాలపాలు..
 కాగా, జిల్లాలో రోజుకోవిధమైన వాతావరణ మార్పులతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం భారీగా కురిసిన వర్షం కారణంగా   వాతావరణం చల్లబడగా... రెండు రోజులకే తిరిగి ఉష్ణోగ్రత పుంజుకుంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురికావడం, చర్మ వ్యాధులు, గొంతులో మార్పులు, ఎండ వేడి కారణంగా కళ్లకు సంబంధించిన వ్యాధులు సోకుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement