సొంత ఊళ్లకు తెలంగాణ ప్రజలు | Telangana residents moving to Native places | Sakshi
Sakshi News home page

సొంత ఊళ్లకు తెలంగాణ ప్రజలు

Aug 12 2014 1:23 AM | Updated on Aug 15 2018 9:22 PM

సొంత ఊళ్లకు తెలంగాణ ప్రజలు - Sakshi

సొంత ఊళ్లకు తెలంగాణ ప్రజలు

తెలంగాణలో 19వ తేదీన చేపట్టనున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు

  • దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్న జనం
  •   అదనంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని టీ సర్కారుకు విజ్ఞప్తులు
  •  
     ముంబై: తెలంగాణలో 19వ తేదీన చేపట్టనున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ‘సర్వే రోజున లేకపోతే లెక్కల్లో లేనట్లే..’ అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. వారంతా సొంత ప్రాంతాలకు బయలుదేరారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబైలోనే దాదాపు ఎనిమిది లక్షల మంది వరకూ తెలంగాణవారు ఉన్నట్లు అంచనా. వీరితోపాటు మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లో సూరత్ సహా పలు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ జిల్లాల వారు పనిచేస్తున్నారు. సర్వే నేపథ్యంలో వీరంతా సొంత ఊళ్లకు బయలుదేరుతుండడంతో... ముంబై నుంచి తెలంగాణ జిల్లాలకు చేరుకునే రైళ్లు, బస్సులు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. 18వ తేదీ వరకూ సీట్లన్నీ ముందే రిజర్వు అయిపోయాయి. దీంతో అక్కడి ప్రైవేటు ఆపరేటర్లు అదనపు బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయినా అవేమీ సరిపోయే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ముంబై నుంచి అదనపు బస్సులు నడపాలని తెలంగాణ సర్కారుకు అక్కడ నివసిస్తున్న తెలంగాణవారు విజ్ఞ ప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని తాము తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ముంబై నుంచి అదనపు రైళ్లు, బస్సులు నడిపించాలని కోరామని టీఆర్‌ఎస్ ముంబై శాఖ అధ్యక్షుడు హేమంత్ కుమార్ చెప్పారు. కాగా.. తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్నారని, అందువల్ల అదనపు బస్సులు నడిపించాలని చూస్తున్నామని వర్లిలోని ఒక ప్రైవేటు బస్సు ట్రావెల్ సంస్థ యజమాని పేర్కొన్నారు.
     
     19న సెలవు
     సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 19వ తేదీన ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి సర్వే సందర్భంగా అందరూ ఇళ్లల్లో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఆరోజును సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులకు ఆ రోజు సెలవు దినంగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న  హైదరాబాద్‌తో అన్ని ప్రాంతాలకు  వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement