జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు | Telangana Record 19 Percent Growth In GST Collection | Sakshi
Sakshi News home page

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు

Feb 18 2020 4:19 AM | Updated on Feb 18 2020 5:19 AM

Telangana Record 19 Percent Growth In GST Collection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో వృద్ధి కన్పిస్తోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 19 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది జనవరిలో జీఎస్టీ కింద రూ.3,195 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది అది రూ.3,787 కోట్లకు చేరింది. జనవరి జీఎస్టీ రాబడులకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే చండీగఢ్‌ రాష్ట్రంలో అత్యధిక వృద్ధి 22 శాతం నమోదు కాగా, గుజరాత్, మహారాష్ట్రలతో దీటుగా 19% వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ నాలుగో స్థానానికి చేరింది. మన రాష్ట్రం తర్వాత కేరళలో 17% వృద్ధి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

కాగా, ఈ ఏడాది జనవరిలో వసూలైన రూ.3,787 కోట్లతో కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను, 10 నెలల కాలంలో మొత్తం రూ.24135.3 కోట్లు జీఎస్టీ ద్వారా వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31,186.67 కోట్లు జీఎస్టీ రూపంలో ఆదా యం వస్తుందని అంచనా వేయగా, అందులో 77.3 శాతం రాబడి వచ్చింది. గతేడాది రూ.34,232.93 కోట్లు జీఎస్టీ రాబడులుంటాయని అంచనా వేయగా, 2019 మార్చి ముగిసే నాటికి 84.09 శాతం.. అంటే రూ.28,786.44 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది మరో 2 నెలలు మిగిలి ఉండటంతో ఈ 2 నెలల్లో కలిపి మరో రూ.6 వేల కోట్లు వచ్చే అవకాశముందని, దీంతో బడ్జెట్‌ అంచనాలతో సమానంగా లేదంటే అంతకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. కాగా, జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర పనితీరును 15వ ఆర్థిక సంఘం కూడా మెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement