‘మునిసిపల్‌’ వేతనాలు పెంపు!

Telangana Municipal Outsourcing Workers Salaries Hiked - Sakshi

ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు రూ.12 వేలు 

డ్రైవర్లకు రూ.15 వేలు, ఆపరేటర్లకు రూ.17,500 

ఏప్రిల్‌ నుంచే అమలు.. 17,022 మందికి ప్రయోజనం 

సాక్షి, హైదరాబాద్‌ : మునిసిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు శుభవార్త. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.8,300 నుంచి రూ.12,000లకు, డ్రైవర్ల వేతనాలు రూ.15 వేలకు, కంప్యూటర్‌ ఆపరేటర్లు/సీనియర్‌ అసిస్టెంట్లు/ఇతర కార్యాలయ సిబ్బంది వేతనాలు రూ.17,500కు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీతో పురపాలక శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. పెరిగిన వేతనాలను ఏప్రిల్‌ నుంచే అమలు చేయనున్నారు. పెంపు ద్వారా 17,022 మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. వీరిలో 11,497 మంది పురుషులు.. 5,525 మంది మహిళలున్నారు.  
జీవో నంబర్‌ 

14 ప్రకారం.. 
రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ 2016 ఫిబ్రవరి 19న ఆర్థిక శాఖ జీవో నం.14 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కార్మికుల వేతనాలు పెంచుతామని శ్రీదేవి హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తెలిపారు. వేతనాల పెంపుతో పాటు బకాయి వేతనాల చెల్లింపు, ఎన్‌ఎంఆర్‌ ఫిక్స్‌డ్‌ పే కార్మికుల క్రమబద్ధీకరణ, అంత్యక్రియల ఖర్చుకు రూ.20 వేలు, చెప్పులు, నూనెలు తదితర డిమాండ్లపై త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్నారని తెలిపారు. వేతనాల పెంపు కోసం ఈ నెల 25 నుంచి సమ్మె బాట పట్టిన కార్మికులు.. పెంపునకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమించి ఆదివారం విధులకు హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీలో రెండేళ్ల కిందట ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. 

పురపాలికల తీర్మానాలతో..  
ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపునకు అనుకూలంగా ఇప్పటికే 56 పురపాలికలు కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానం చేశాయి. పెంపును వ్యతిరేకిస్తూ నర్సంపేట మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. మిగిలిన 16 పురపాలికలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. అన్ని పురపాలికల్లో ఈ నెల 30లోగా కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించి పెంపుపై తీర్మానం చేయాలని మునిసిపల్‌ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. పెంపునకు వ్యతిరేకంగా తీర్మానించిన నర్సంపేటలో మళ్లీ సమావేశం నిర్వహించి అనుకూలంగా తీర్మానం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.  

కొత్త పురపాలికల్లోనూ.. 
ప్రస్తుతం గ్రామ పంచాయతీ హోదా గల 136 గ్రామాల విలీనంతో రాష్ట్రంలో 68 కొత్త పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 45 పురపాలికల్లో మరో 173 గ్రామాలు విలీనమవనున్నాయి. వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రాంతాల్లోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల పెంపు కూడా తక్షణమే అమల్లోకి రానుంది. ఇతర పురపాలికలతో సమానంగా కొత్త పురపాలికల్లోనూ వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top