టీకాల్లో వెనుకబాటు.. అట్టడుగు స్థానంలో తెలంగాణ

Telangana Last Position In Polio Vaccine - Sakshi

2019–20లో పరిమితమైన టీకాలు 54.3%

80%.  మించని పోలియో టీకాలు

నిర్లక్ష్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం 

సాక్షి, హైదరాబాద్‌ : పిల్లలకు టీకాలు వేయడంలో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 35వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2019–20లో ఇప్పటివరకు దేశంలో టీకాలు వేయడంలో తమిళనాడు 148 శాతంతో మొదటిస్థానంలో నిలవగా, అట్టడుగు స్థానంలో సిక్కిం 53.60 శాతం, ఆ తర్వాత తెలంగాణ 54.30 శాతంతో వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, టీకాలు సరఫరా చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది. 2018–19లో మాత్రం తెలంగాణ 95.98 శాతం టీకాలు వేసింది. 2017–18లో 88.96 శాతం కవర్‌ చేసింది. కానీ ఈ ఏడాది వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది.(6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు)

విటమిన్‌ ఏ టీకాలే తక్కువగా...
యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రాం కింద గిరిజనులు, ఇతర మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు వేస్తారు. మిషన్‌ ఇంద్రధనుష్, ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్, గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (జీఎస్‌ఏ) పథకాల కింద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. బీసీజీ, ఓరల్‌ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్‌ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్‌ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్‌ వ్యాక్సిన్‌ (ఐపీవీ), మీజిల్స్‌ రుబెల్లా (ఎంఆర్‌) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్‌–టెటానస్‌ (టీపీటీ), రోటావైరస్‌ వ్యాక్సిన్‌ (ఆర్‌వీవీ) తదితరమైనవి వేయాల్సి ఉంటుంది. ఆ టీకాలు వేయడం వల్ల సంబంధిత రోగాల నియంత్రణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాలను చేపట్టింది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం వ్యాక్సిన్లపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని కేంద్ర నివేదిక చెబుతోంది.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 80.3 శాతమే పోలియో వ్యాక్సిన్లు వేసినట్లు తేల్చింది. అలాగే తట్టు (మీజిల్స్‌) టీకాలు 81.9 శాతమే వేశారు. బీసీజీ టీకాలు 83.6 శాతం మందికి వేశారు. ఇవిగాక విటమిన్‌ ఏ టీకాలు మూడు దశలకు సంబంధించి కేవలం 15 నుంచి 36 శాతం మధ్యే వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పోలియో వంటి టీకాలను ఇంటింటికీ తిరిగి వేస్తున్నామని, బస్టాండ్లు, స్కూళ్లు, ఆరుబయట ఎక్కడ కనిపిస్తే అక్కడ చిన్న పిల్లలకు వేస్తున్నామని చెబుతున్నా, ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో టీకాలు అందుబాటులో ఉంచకపోవడం కూడా ఇంత వెనుకబాటుకు ఒక కారణంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

చిన్న పిల్లలకు బీసీజీ, ఓరల్‌ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్‌ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్‌ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్‌ వ్యాక్సిన్‌ (ఐపీవీ), మీజిల్స్‌ రుబెల్లా (ఎంఆర్‌) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్‌–టెటానస్‌ (టీపీటీ), రోటావైరస్‌ వ్యాక్సిన్‌ (ఆర్‌వీవీ) తదితర టీకాలు వేయాల్సి ఉంటుంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top