మున్సి‘పోల్స్‌’పై తేలనున్న భవితవ్యం  | Telangana High Court Today Judgements On Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’పై తేలనున్న భవితవ్యం 

Aug 13 2019 7:00 AM | Updated on Aug 13 2019 7:00 AM

Telangana High Court Today Judgements On Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునిసిపల్‌ ఎన్నికలపై నేడు స్పష్టత రానుంది. మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు రానున్న నేపథ్యంలో పురపోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వార్డుల డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలైంది. ఇవే అభ్యంతరాలతో పలు మున్సిపాలిటీల నేతలు కూడా పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయస్థానం ఎన్నికలను నిలిపివేస్తూ స్టేలు విధించింది. ఈ పరిణామాలు ప్రభుత్వ ముందరికాళ్లకు బంధం వేశాయి. ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేయా లని సర్కార్‌ భావించినా, న్యాయపరమైన చిక్కు లు ప్రతిబంధకంగా మారాయి. ఇటీవల పిల్‌ను విచారించిన న్యాయస్థానం కేసును ఈనెల 13కి వాయిదా వేసింది. కోర్టు కేసులు ఉన్నవాటిని మినహాయించి, అభ్యంతరాల్లేని పురపాలికల ఎన్నికల నిర్వహణకు అనుమతివ్వాలని ఎస్‌ఈసీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

వార్డుల విభజన, ఓటర్ల జాబితాల తయారీపై వెల్లువెత్తిన అభ్యంతరాలను పరిష్కరించామని, ఎన్నికలను నిలిపివేస్తూ విధించిన స్టేలను ఎత్తివేయాలని ప్రభుత్వం కూడా కౌంటర్‌ దాఖలు చేసింది. దీంతో మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులన్నీ మంగళవారం ధర్మాసనం ముందుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ విచారణలో మున్సిపోల్స్‌పై స్పష్టత వస్తే.. సెప్టెంబర్‌ ద్వితీయార్ధంలోపు ఎన్నికల క్రతువు పూర్తయ్యే వీలుంది. న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నా.. పురపాలక శాఖ ఎన్నికల కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. ఎన్నికల అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, రూట్‌ ఆఫీ సర్ల నియామకం ప్రక్రియను కొలిక్కి తెచ్చింది. హైకోర్టు నిర్ణయం వెలువడగానే వార్డు/డివిజన్, చైర్‌పర్సన్‌/మేయర్‌ స్థానాల రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేసి ఎస్‌ఈసీకి అందజేయాలని మున్సిపల్‌ శాఖ భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా నగారా మోగించేందుకు ఈసీ కూడా సిద్ధమవుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement