సఫాయీ.. ఓ సిపాయి | Sakshi
Sakshi News home page

సఫాయీ.. ఓ సిపాయి

Published Sat, Apr 25 2020 7:47 AM

Telangana Government Thanks to GHMC Workers And Employees - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దేశ రక్షణలో భాగంగా సైనికుడు ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే..  వీధుల్లోని చెత్తా చెదారాన్ని ఊడ్చి పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా తమవంతు సేవలు అందిస్తున్నారు మన సఫాయీ కార్మికులు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కరోనా నివారణలో సిపాయీల వలే పోరాడుతున్నారు. తమను తాము రక్షించుకుంటూ.. నగరాన్ని రక్షిస్తున్నారు. తమ కుటుంబాలకూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.  ఎవరు కాదంటున్నా.. తాము పొరకపట్టకుంటే నగరం చెత్తా చెదారాలతో అధ్వానంగా మారి రోగాన్ని పెంచే ప్రమాదముందంటూ సూరీడుతో పోటీపడుతూ పనులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సైతం వారికి అవసరమైన మాస్కులు, చేతులకు గ్లవుజులతో పాటు, సబ్బులు,కొబ్బరి నూనె తదితరాలను అందజేస్తోంది. ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు ప్రతి 3 నెలలకోసారి వైద్య పరీక్షలు చేస్తోంది. నగర ఆరోగ్యం బాగుండాలంటే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం బాగుండాలనే ప్రధాన ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇలా.. ఇటు అధికారులు, అటు కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే  జీహెచ్‌ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులు ఇతర నగరాలకు ఆదర్శప్రాయంగా మారారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇప్పటికే  39 మంది పారిశుద్ధ్య కార్మికులు కరోనాతో ఆస్పత్రుల్లో చేరారు.

ఆదర్శంగా హైదరాబాద్‌..
నగరంలో ఆచరిస్తున్న  విధానాలు, తీసుకుంటున్న శ్రద్ధ తదితరాలతోనే ఇది సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మున్సిపల్‌ మంత్రి, మేయర్‌ తదితరుల వరకు ఎందరెందరో వారికి అండగా మేమున్నామంటూ గుర్తు చేస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేయడంతో పాటు వారికి స్వయంగా వడ్డించడం తెలిసిందే. శుక్రవారం చార్మి నార్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా భారీ కార్యక్రమం నిర్వహించారు. వారి సేవలకు  గుర్తింపుగా ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలిస్తున్నారు. వారితోపాటు క్రిమిసంహరణలకు ఎంటమాలజీ, ఈవీడీఎం విభాగంలోని డీఆర్‌ఎఫ్‌ బ్రుందాలు స్ప్రేయింగ్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ చర్యల వల్లే హైదరాబాద్‌ కరోనా కట్టడిలో మిగతా నగరాల కంటే మెరుగ్గా ఉంది.

జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సంఘీభావం  
చార్మినార్‌: కోవిడ్‌–19 వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. కరోనా నియంత్రణలో నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సంఘీభావంగా చార్మినార్‌ వద్ద శుక్రవారం ‘ఫైట్‌ ఎగెనిస్ట్‌ కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌’ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కరోనాను తరిమేయడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ సిబ్బంది, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సిబ్బందికి అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి జోహార్లు అని నినదించారు. పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం నెల జీతంతో పాటు రూ.7500 అదనంగా ఇస్తోందన్నారు. మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్, గ్రేటర్‌ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, ఈవీడఎం డైరెక్టర్‌ విశ్వజిత్, చార్మినార్‌ జోన్‌ ఓఎస్‌డీ శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ సామ్రాట్‌ అశోక్‌ ఉన్నారు.

Advertisement
Advertisement