ఇక జాప్యానికి వీల్లేదు..

Telangana Government claims in Supreme Court about High Court  - Sakshi

     హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు 

     అవసరమైతే హైకోర్టు భవనం మొత్తాన్ని ఏపీకి ఇచ్చేస్తాం..! 

     ఖాళీగా ఉన్న 24 గదుల్లోనైనా ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు 

     కేంద్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై విచారణ జరిపిన ధర్మాసనం 

     వివరణ ఇవ్వాలంటూ ఏపీ, ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఉమ్మడి హైకోర్టు విభజనను ఇక ఎంత మాత్రం జాప్యం చేయడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనం మొత్తాన్ని ఏపీకి ఇచ్చేసి తాము విడిగా హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు విడిగా హైకోర్టు ఏర్పాటులో వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనంలో 24 గదులు ఖాళీగా ఉన్నాయని, వాటిలోనైనా ఏపీ హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వివరించారు. అవసరమనుకుంటే ఉమ్మడి హైకోర్టు భవనం మొత్తాన్ని ఏపీకి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తాము మరో చోట హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. చట్టసభలు, అధికారుల విభజన జరిగినా న్యాయవ్యవస్థ విభజన జరగలేదని వివరించారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. న్యాయాధికారుల కేసు కూడా ఇదే కోర్టులో నడుస్తోందని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ ప్రాంత వాటా అమలు కావడంలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో రెండు వారాల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ధన్‌గోపాల్‌కు కూడా కోర్టు నోటీసులిచ్చింది.  

నిబంధనలేవీ అడ్డంకిగా లేవు.. 
ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనాన్ని రెండుగా విభజించి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసేందుకు నిబంధనలేవీ అడ్డంకిగా లేవని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు ఉమ్మడి హైకోర్టు భవనంలో రెండు రాష్ట్రాల హైకోర్టుల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు.

ఈ విషయంలో ఏపీ భూభాగంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో హేతుబద్ధత లేదని, దీన్ని కొట్టివేయాలని కోరారు. అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ చేసిన వాదనలతో తెలంగాణ ప్రభుత్వం ఏకీభవించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు ఎంత సమయం ఉందని ప్రశ్నించింది. దానికి పదేళ్ల సమయం ఉందని వేణుగోపాల్‌ బదులిచ్చారు. ఉమ్మడి హైకోర్టులో 24 గదులు ఖాళీగా ఉన్నాయని, అవసరమైతే తాము మరోచోట హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పుడున్న భవనంలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిబంధనలేవీ అడ్డురావని స్పష్టం చేశారు. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఏఏజీ రామచంద్రారావులు కోర్టుకు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top