అడవికి రక్షణ 

Telangana Forest Department Protection Plans For Forest - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లా అడవులకు పెట్టింది పేరు. కానీ ఇక్కడి అడవులు ఉష్ణ మండలానికి చెందినవి కావడంతో వేసవిలో ఆకు రాలుతాయి. ఇలా రాలిన ఆకులు, గింజలు భూమిపై పడడం..అడవుల్లోకి వెళ్లిన వారు బీడీలు, చుట్టలు కాల్చి పారేయడంతో అడవులు అంటుకొని కాలిపోతున్నాయి. దీని నుంచి అడవులను రక్షించేందుకు అటవీ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ మంటలు చెలరేగినా శాస్త్రీయ పద్ధతిలో శాటిలైట్ల ద్వారా గుర్తించి ఆర్పి వేస్తున్నారు.

ఈ విధానంలో మంటలు అంటుకున్న విషయంపై సంబంధిత రేంజ్‌ పరిధిలోని బీట్‌ అధికారికి మేసేజ్‌ వెళ్తుంది. వెంటనే సంబంధిత అధికారి  సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేస్తారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లవద్దని, పశువులు, కాపరులు, స్మగ్లర్లు, అగ్గిపెట్టెలు, నిప్పు రాజేసే లైటర్లతో అడవుల్లోకి వెళితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో   uమొదటిపేజీ తరువాయిపాటు అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎండిన ఆకులను వేరే చేయడం.. పైప్‌లైన్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది.

కాలితే బూడిదే..
జిల్లాలో 1.55లక్షల హెక్టార్లలో అటవీ..వంద నుంచి 200 ఎకరాల్లో ఏడాది పొడవునా ఏపుగా పెరిగిన మొక్కలు వేసవి కాలం వచ్చే సరికి అడవుల్లో నిప్పు పడి (ఎలగడి) పెద్దగా మంటలు లేస్తూ కొత్తగా ఎదుగుతున్న మొక్కలను కాల్చివేస్తుండగా, పెద్ద పెద్ద వృక్షాల మొదళ్లలో మంటలు వ్యాపించి వాటికి నష్టం చేకూరుస్తున్నాయి. దీనిని అధిగమించడానికి వీలైనన్ని చర్యలు చేపడుతున్నారు. అడవుల దహనాన్ని అడ్డుకోవడానికి అటవీ శాఖ ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో ఆయా రేంజ్‌ పరిధిలోని అడవుల్లో గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల చొప్పున ఫైర్‌లైన్ల ఏర్పాటును పూర్తి చేశారు. ఫైర్‌పైన్ల విభజన తరువాత వాటిని అధికారులు దగ్గరుండి ఎండిన ఆకులను కాల్చి వేయిస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే అగ్ని అడవుల్లోకి ప్రవేశించకుండా ఉంటోంది.

ఫైర్‌లైన్‌ అంటే..
రోడ్డు వెంట ఉన్న అడవుల్లో ప్రస్తుతం విపరీతమైన ఆకు రాలి కుప్పకుప్పలుగా పడి ఉంటుంది. రోడ్డు వెంట వెళ్లే వారు సిగరేట్, బీడీ కాల్చి వదిలేస్తే ఎండిన ఆకులు కావడంతో క్షణాల్లో అడువుల్లోకి మంటలు వ్యాపించి అడవులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. దీనిని అదుపు చేయడానికి రోడ్డు హద్దుకు 6 మీటర్ల దూరంలో ఆకును ఒక లైన్‌గా విభజిస్తున్నారు. దీంతో ఎండిన ఆకులు రెండుగా విభజించడంతో ఎండిన ఆకులకు తగిలిన అగ్ని విభజన రేఖ (గీత) వద్దకు వెళ్లి ఆగిపోతుంది. అధికారులు కూలీలను ఏర్పాటు చేసి రోడ్డు వెంట మొత్తం అటవీ ప్రాంతాల్లో ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
 
కొనసాగుతున్న ఫైర్‌లైన్ల ఏర్పాటు..
ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెళ్లి, బోథ్, నేరడిగొండ తదితర రేంజ్‌ల పరిధిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా అటవీ ప్రాంతాల్లో గడిచిన నెల రోజుల నుంచి రోజు పదుల సంఖ్యలో కూలీలతో ఫైర్‌లైన్‌ ఏర్పాటుకు ఆకులను చీపుర్లతో ఊడ్చి ఆకును ఒక చోట చేర్చి వాటిని కాల్చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే బ్లోవెర్‌ యంత్రాలతో ఆకులను దగ్గరికి చేస్తున్నారు. దీంతోపాటు అటవీ ప్రాంతంలో ఎక్కడైన నిప్పు అంటుకుంటే శాటిలైట్‌ ద్వారా దానిని పర్యవేక్షించి వెంటనే ఆర్పుతున్నారు.
 
ముమ్మర ప్రచారం..
అడువుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా గ్రామాల్లో అటవీశాఖ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా రైతులు వేసవి కాలంలో పత్తి కట్టెను వ్యవసాయ పొలాల్లోనే కాల్చుతారు. ఆ మంటలు అటవీ ప్రాంతాల్లోకి వ్యాపించకుండా కాల్చినంతరం దగ్గరుండి ఆర్పివేయాలని రైతులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా అడవుల్లోకి అగ్నిని రాజేసే వస్తువులను తీసుకెళ్తే భారీ జరిమానా విధిస్తామని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచరిస్తున్నారు. అలాగే కళాజాత బృందాల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

అగ్ని ప్రమాదాలకుతావులేకుండా చర్యలు
అడవుల అభివృద్ధిలో భాగంగా అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. దీంతోపాటు ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే ఆర్పే కార్యక్రమంలో ప్రజలను, ఉద్యోగులను భాగస్వాములను చేస్తున్నాం. అడవుల సంరక్షణలో అందరి సహకారం తీసుకుంటున్నాం. – అప్పయ్య, ఎఫ్‌ఆర్వో, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top