పోల్‌ చిట్టీయే.. ఓ గూగుల్‌ మ్యాప్‌ 

Telangana Elections Voters Use To Google Map For Polling Station Locations - Sakshi

నల్లగొండ  : పోల్‌ చిట్టీ.. ఓ గూగుల్‌ మ్యాప్‌లా ఉపయోగపడనుంది.  ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఈసారి వీటి విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో అభ్యర్థులే తమ ఏజెంట్ల ద్వారా పోలింగ్‌ బూత్‌కు వచ్చే ఓటర్లకు జాబితాలో వారి సంఖ్య చూసి పోల్‌చిట్టీ రాసి ఇచ్చేవారు. దాన్ని తీసుకొని పోలింగ్‌కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల సం ఘం పోల్‌ చిట్టీలను ముద్రించి నేరుగా ఓటర్‌ ఇంటికి వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మొదలైంది. చిట్టీమీద ఫొటోతోపాటు ఓటరు జాబితాలో ఉన్న ఐడీ నంబర్, వెనకాల తన ఓటు ఏ పోలింగ్‌ కేం ద్రంలో ఉంది.. ఆ కేంద్రం ఎక్కడ ఉంది.. ఏ దారిగుండా, ఏ దిక్కు కు వెళ్లాలి అనేది సవివరంగా ముద్రించింది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటర్లకు ఓటు వేయడం సులభమవుతుంది.

చిట్టీల పంపిణీ ప్రారంభం.. 
జిల్లాలోని 6 నియోజకవర్గాల  పరిధిలో 12,87,370 మంది ఓటర్లు ఉండగా, 1,629 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రతి ఓటరుకు పోల్‌ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి బీఎల్‌ఓలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో గురువారం పోల్‌ చిట్టీల పంపిణీని ప్రారంభించారు.
 
గుర్తింపు కార్డులా పోల్‌ చిట్టీ. 
గతంలో పోల్‌ చిట్టీ తెల్లకాగితంమీద రాసిచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఓటరు ఫొటోతో పాటుపేరు, ఎపిక్‌ నంబర్, పోలింగ్‌ కేంద్రం నంబర్‌ కూడా ఉంటుండడంతో ఇదో గుర్తింపు కార్డు మాదిరిగా అయ్యింది. గతంలో ఓటు వేసేందుకు ఓటర్‌ ఐడీకార్డు లేనివారు రేషన్‌ కార్డో.. డ్రైవింగ్‌ లైసెన్సో, బ్యాంక్‌ పాస్‌బుక్కో తీసుకొనివెళ్లి చూపించాల్సి ఉండేది. ప్రస్తుతం అవేవీ అవసరం లేదు. ఒక్క పోటీ చిట్టీ ఉంటే సరిపోతుంది. 

సమయం ఆదా.... 
అన్ని గుర్తింపులు ఉన్న పోల్‌ చిట్టీ ముద్రించడం వల్ల పోలింగ్‌ త్వరితగతిన పూర్తి కావడంతోపాటు ఓటరు ఓటు వేసే సమయం ఆదా అవుతుంది. చిట్టీ పట్టుకుని నేరుగా వెళ్లి పోలింగ్‌ అధికారికి చూపిస్తే దానిపై ఉన్న నంబర్‌ ఆధారంగా ఓటర్ల జాబితాలోని నంబర్‌తో సరిచూస్తారు. ఫొటో కూడా చెక్‌చేస్తారు. ఆ ఓటరు నిజమైన ఓటరా... కాదా అనేది తేలిపోతుంది. ఓటరును గుర్తించడం అక్కడున్న పార్టీ ఏజెంట్లకు కూడా సులభతరం అవుతుంది.
 
బోగస్‌ ఓట్లకు తావుండదు ..
పోల్‌ చిట్టీపై అన్ని వివరాలు ఉంటుండడంతో బోగస్‌ ఓట్లు వేసేందుకు తావుండదు. గతంలో ఇలాంటి పోల్‌చిట్టీలు లేకపోవడం వల్ల ఎవరైనా ఓటు వేయకపోతే ఇతనే ఆ ఓటరు అంటూ వేరేవారితో ఓటు వేయించిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఏజెంట్లు గుర్తుపట్టిన సందర్భాల్లో గొడవలు జరిగేవి. ఇలాంటి సంఘటనలకు చెక్‌పెట్టేందుకే ఎన్నికల కమిషన్‌ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

పార్టీ ఏజెంట్లకు తప్పినతిప్పలు..
ఓటర్లను గుర్తు పట్టేందుకు ఆయా పార్టీల ఏజెంట్లు ఎన్నో తిప్పలు పడేవారు. ఏజెంట్లు ఆయా పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఉండే అందరి ఓటర్లను గుర్తు పట్టాలని ఏమీ ఉండదు. ఇప్పుడు పోల్‌చిట్టీమీద ఓటరు ఫొటోతోపాటు అతని పేరు, తండ్రిపేరు ఉండడం వల్ల పార్టీనేతలు కూడా ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని గుర్తించడం ఈజీగా మారింది. దీంతో ఏజెంట్లకు కూడా తిప్పలు తప్పాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top