పనులు చకచకా..

Telangana Election Works District Officers Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ఎన్నికల వేళ సమీపిస్తుండడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే కార్యాచరణ రూపొందించిన అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించగా ఎన్నికల కోడ్‌ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న వారిపై ఫిర్యాదులు అందుతుండడంతో అధికార యంత్రాంగం ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లపై దృష్టి సారించారు.

ఏ ఇబ్బంది రావొద్దు.. 
ఓటింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఏ ఇబ్బంది కలగకుండా మౌళిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి కావాల్సిన ఏర్పాట్లపై నివేదికలు రూపొదించారు. జిల్లాలో మొత్తం 1,312 పోలింగ్‌ కేం ద్రాలు ఉండగా.. ఓటర్లకు సౌకర్యాలు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులను నిర్మిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాలపై సంబందిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే సౌకర్యాల కల్పన పనులు తుది దశకు చేరాయి. ప్రచారాలతో పార్టీల అభ్యర్థులు ఓ పక్క హోరెత్తిస్తుండగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం మరోపక్క చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

వసతుల కల్పన 
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీటి ఏర్పాటుచేయడంతో పాటు వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. 2014 ఎన్నికల కంటే ఈసారి మెరుగైన సౌకర్యాలతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఈఆర్వోలు పరిశీలించి స్వయంగా అక్కడి పరిస్థితులు తెలుసుకుని సౌకర్యాల కల్పనపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.

దివ్యాంగులు, వృద్దులకు సదుపాయాలు 
ఎన్నికల కమిషన్‌ ఆదేశల మేరకు జిల్లాలో దివ్యాంగులను ఓటర్ల జాబితాలు పరిశీలించి మార్క్‌ చేస్తున్నారు. దివ్యాంగులు ఈసారి వంద శాతం ఓటు హక్కు నమోదు చేసుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మేరకు వారు ఓటు హక్కును ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకునేలా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద యుద్ధ ప్రాతిపదికన ర్యాంపుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రానికి దివ్యాంగులు చేరుకునేందుకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు దివ్యాంగులు, వృద్ధు లు పోలింగ్‌ కేంద్రాలకు రాగానే నిరీక్షించకుండా నేరుగా వెళ్లి ఓటు వేసేందుకు ఏ ర్పాట్లు చేయనున్నారు. అవసరమైన చోట్ల వీల్‌చైర్లు అవసరమున్న వారికి అందుబాటులో ఉంచుతారు. ఇలా ఓ పక్క ఉద్యోగుల నియామకం, ప్రచార సరళిపై నజర్‌ వేసిన అధికారులు.. మరోపక్క పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top