కాంగ్రెస్‌లో ‘పెత్తనం’.. జిల్లాకు దక్కేనా?

Telangana Congress PCC President Post Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ జిల్లాలో ఢీలా పడినట్లు కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ వచ్చిన ఆ పార్టీ ఈసారి మాత్రం ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఫలితాల చేదు కాంగ్రెస్‌ నాయకత్వానికి మింగుడు పడేలా లేదు. దీంతో ఈ ప్రభావం పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం అంతా ఇది వరకు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించేది. సీనియర్‌ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి వారు ఓటమి పాలుకావడం ఆ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం నడుస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు అంత దూకుడుగా కనిపించడం లేదని ఉదహరిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో సంస్థాగత పదవులు, రాజకీయాలపైనే ఎడతెగని చర్చ నడుస్తోంది.

పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా?
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు చెందిన హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఆయన టీ.పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా..? పక్కకు తప్పుకుని వేరే పోస్టులోకి వెళతారా అన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరిగింది. అసలు అధ్యక్షుడిని మార్చే అవకాశం లేకుంటే, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అదే పదవిలో కొనసాగితే జిల్లాకు అ పదవి ఉన్నట్టే లెక్క. అయితే, ఈ విషయంలో ఏఐసీసీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది..? అసలు టీ.పీసీసీ అధ్యక్షుడి మదిలో ఏముందన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. మొదటినుంచి పీసీసీ పదవిని ఆశిస్తున్న ‘కోమటిరెడ్డి’ సోదరులు సంస్థాగతంగా జరగబోయే మార్పుల కోసం, ఏఐసీసీ నాయకత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంటున్నారు.

సీఎల్పీ పదవి.. జిల్లా చేజారేనా?
మరోవైపు తెలంగాణ తొలి శాసనసభలో కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేతగా వ్యవహరించిన జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో జిల్లానుంచి ముగ్గురే ఉండడం, అందులో సీనియర్‌ అయిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో ఈ సారి సీఎల్పీ పదవి జిల్లాకు దక్కేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి , సీఎల్పీ పదవిలో ఏదో ఒకటి తమకు కావాల్సిందేనని కోమటిరెడ్డి సోదరులు డిమాండ్‌ చేస్తున్నారని చెబుతున్నారు.

లోక్‌సభ సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా తనకు సీఎల్పీ పోస్టును ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించినా.. టీ.పీసీసీ అధ్యక్ష పదవిపైనా ఆయనకు ఆశలు ఉన్నాయంటున్నారు. అయితే, జిల్లాకు ఈ రెండింటిలో ఏదో ఒక పదవి మాత్రమే దక్కుతుంద3న్న అభిప్రాయం కూ డా ఉంది. ఒకవేళ అటు టీ పీసీసీ అధ్యక్ష పదవి కానీ, లేదా సీఎల్పీ నేత పదవి కాని తమకు దక్కని పక్షంలో కో మటిరెడ్డి సోదరులు ఎలాంటి నిర్ణయం తీసుకుం టారో అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది.

డీసీసీ అధ్యక్ష నియామకంలో ‘వారి’ ముద్ర ఉంటుందా?
జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను సంక్రాంతిలోపు నియమించాలని పార్టీ నాయకత్వం  నిర్ణయించింది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవుల నియమాకంపైనా జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారు..? వారి నియామకాల్లో సీనియర్‌ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరుల ముద్ర ఉంటుందా చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన బూడిద బిక్షమయ్య గౌడ్‌ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉండడం, కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించనుండడంతో నల్లగొండకు నూతన డీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేయాల్సి ఉంది. జానారెడ్డి తన అనుచరుడు రామలింగయ్య యాదవ్‌ పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కోమటిరెడ్డి సోదరులు ఎవరి పేరును సూచిం చారన్న విషయం బయటకు రాలేదు. అయితే, వారి అనుచర నేత, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్‌లో సంస్థాగత వ్యవహారాలు చర్చనీయాంశాలుగా మారాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top