dcc presdent
-
డీసీసీ చీఫ్లు మూడేళ్ల పాటుఎన్నికల్లో పోటీకి దూరమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకి మూలస్తంభాలైన డీసీసీ అధ్యక్షులు పార్టీ కార్యలాపాలపై పూర్తి దృష్టి పెట్టేందుకు వీలుగా నియమితులైన మొదటి మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ నియమించిన ముకుల్ వాస్నిక్ కమిటీ చేసిన మూడేళ్ల నిషేధం ప్రతిపాదనను పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్నిక్ కమిటీ సిఫార్సుల ప్రకారం డీసీసీ అధ్యక్షులు తమ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీకి అనుమతించరు. వీరంతా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలను నిర్ధారించడం, ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పరిశీలించడం, సామాజిక ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాలను రూపొందించడం, జిల్లాల్లో ని అన్ని స్థాయిలలో మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం వంటి పనులకు నాయకత్వం వహిస్తారు. అభ్యర్థుల ఎంపికలో, వివిధ పదవులకు నామినీల పరిశీలనలో వీరే క్రియాశీలంగా ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత వహిస్తారు. ఈ మూడేళ్ల తర్వాత పదవుల ఎంపికలో డీసీసీలకు ప్రాధాన్యమిస్తారు. మూడేళ్ల ప్రతిపాదనపై వచ్చే నెలలో గుజరాత్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. -
కాంగ్రెస్లో ‘పెత్తనం’.. జిల్లాకు దక్కేనా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జిల్లాలో ఢీలా పడినట్లు కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ వచ్చిన ఆ పార్టీ ఈసారి మాత్రం ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఫలితాల చేదు కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు పడేలా లేదు. దీంతో ఈ ప్రభావం పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం అంతా ఇది వరకు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించేది. సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి వారు ఓటమి పాలుకావడం ఆ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం నడుస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు అంత దూకుడుగా కనిపించడం లేదని ఉదహరిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో సంస్థాగత పదవులు, రాజకీయాలపైనే ఎడతెగని చర్చ నడుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు చెందిన హుజూర్నగర్ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి వ్యవహరిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఆయన టీ.పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా..? పక్కకు తప్పుకుని వేరే పోస్టులోకి వెళతారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. అసలు అధ్యక్షుడిని మార్చే అవకాశం లేకుంటే, ఉత్తమ్ కుమార్రెడ్డి అదే పదవిలో కొనసాగితే జిల్లాకు అ పదవి ఉన్నట్టే లెక్క. అయితే, ఈ విషయంలో ఏఐసీసీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది..? అసలు టీ.పీసీసీ అధ్యక్షుడి మదిలో ఏముందన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. మొదటినుంచి పీసీసీ పదవిని ఆశిస్తున్న ‘కోమటిరెడ్డి’ సోదరులు సంస్థాగతంగా జరగబోయే మార్పుల కోసం, ఏఐసీసీ నాయకత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంటున్నారు. సీఎల్పీ పదవి.. జిల్లా చేజారేనా? మరోవైపు తెలంగాణ తొలి శాసనసభలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా వ్యవహరించిన జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జిల్లానుంచి ముగ్గురే ఉండడం, అందులో సీనియర్ అయిన ఉత్తమ్ కుమార్రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో ఈ సారి సీఎల్పీ పదవి జిల్లాకు దక్కేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి , సీఎల్పీ పదవిలో ఏదో ఒకటి తమకు కావాల్సిందేనని కోమటిరెడ్డి సోదరులు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. లోక్సభ సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా తనకు సీఎల్పీ పోస్టును ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించినా.. టీ.పీసీసీ అధ్యక్ష పదవిపైనా ఆయనకు ఆశలు ఉన్నాయంటున్నారు. అయితే, జిల్లాకు ఈ రెండింటిలో ఏదో ఒక పదవి మాత్రమే దక్కుతుంద3న్న అభిప్రాయం కూ డా ఉంది. ఒకవేళ అటు టీ పీసీసీ అధ్యక్ష పదవి కానీ, లేదా సీఎల్పీ నేత పదవి కాని తమకు దక్కని పక్షంలో కో మటిరెడ్డి సోదరులు ఎలాంటి నిర్ణయం తీసుకుం టారో అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. డీసీసీ అధ్యక్ష నియామకంలో ‘వారి’ ముద్ర ఉంటుందా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను సంక్రాంతిలోపు నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవుల నియమాకంపైనా జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారు..? వారి నియామకాల్లో సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరుల ముద్ర ఉంటుందా చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన బూడిద బిక్షమయ్య గౌడ్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉండడం, కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించనుండడంతో నల్లగొండకు నూతన డీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేయాల్సి ఉంది. జానారెడ్డి తన అనుచరుడు రామలింగయ్య యాదవ్ పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కోమటిరెడ్డి సోదరులు ఎవరి పేరును సూచిం చారన్న విషయం బయటకు రాలేదు. అయితే, వారి అనుచర నేత, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్లో సంస్థాగత వ్యవహారాలు చర్చనీయాంశాలుగా మారాయి. -
ధనార్జనే లక్ష్యంగా ప్రభుత్వ పాలన
∙హోదా వద్దన్నందుకే చంద్రబాబుకు పోలవరం బహుమతి ∙శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య ధ్వజం ∙డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ధనేకుల మచిలీపట్నం టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీకి ఒప్పుకున్నంనదుకే కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు పోలవరం నిధులను బహుమతిగా ఇచ్చిందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు చెన్నంశెట్టి రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ధనార్జనే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ జిల్లా 28వ అధ్యక్షుడిగా నియమితులైన ధనేకుల మురళీమోహనరావు బాధ్యతల స్వీకారోత్సవం ఆదివారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరశింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా రామచంద్రయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు కొట్టేసేందుకు చంద్రబాబు పథకం రచించారని ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని, చంద్రబాబు మాత్రం స్వలాభం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఇంజినీర్లే తలలు పట్టుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును నదుల అనుసంధానం కోసం రూపొందించిన కాంగ్రెస్ పార్టీ... దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పనులు ప్రారంభించిందని చెప్పారు. కుడి, ఎడమ కాలువలను కూడా తవ్వారని తెలిపారు. అయితే చంద్రబాబు తానే నదులను అనుసంధానం చేస్తున్నట్లుగా ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎం.పళ్లంరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నుంచే పాలన చేస్తోందని, ఈ జిల్లాలోని ప్రజల సమస్యలను గుర్తించి పోరాడాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు ఎస్కే మస్తాన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి డీసీసీ నూతన అధ్యక్షుడు, నాయకులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు నెలకొల్పేలా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మురళీమోహనరావు మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎం.రామకృష్ణ, ఎ.శ్రీనివాసకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గుమ్మడి విద్యాసాగర్, బందరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఎన్.రాధికా మాధవి, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్æమతీన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజయశేఖర్, జిల్లా డిస్ట్రీబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, ఆర్టీసీ రీజియన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.