
సాక్షి, చెన్నై/చిత్తూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తమిళనాడు కంచిలోని అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఉన్నారు.
నగరిలో కేసీఆర్‌కు రోజా ఘనస్వాగతం
అంతకుముందు కంచి పర్యటన కోసం ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కంచికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో కేసీఆర్ నగరి చేరుకోగానే రోజా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోజాతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు.