పైలెట్‌లోనే సవాళ్లు

Technical Problems in Ration National Portability - Sakshi

రేషన్‌ నేషనల్‌ పోర్టబిలిటీలో సమస్యలు  

ఏపీ డేటా అనుసంధానానికి చిక్కులు  

పైలెట్‌ ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు  

చేతులెత్తేసిన సివిల్‌ సప్లై అధికారులు   

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రారంభించిన రేషన్‌ నేషనల్‌ పోర్టబిలిటీ పైలట్‌ ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి రెండు నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు. పౌరసరఫరాల అధికారులకు సైతం ఈ ప్రాజెక్టుపై స్పష్టత కరువైంది. దీంతో లబ్ధిదారుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. తెలంగాణ æఈపీడీఎస్‌తో ఏపీ ఈపీడీఎస్‌ డేటా పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడమే ఇందుకు కారణం. డీలర్లు బయోమెట్రిక్‌ గుర్తించడం లేదంటూ సరుకులు పంపిణీ చేయడం లేదు. దీంతో నగరానికి ఉపాధి కోసం వలస వచ్చిన ఏపీ తెల్లరేషన్‌ కార్డుదారులకు నేషనల్‌ పోర్టబిలిటీ కింద సరుకులు అందే దాఖలాలు కానరావడం లేదు. 

ఇదీ ప్రాజెక్టు...  
దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం–ఒకే కార్డు’ పేరుతో జూన్‌–2020 నుంచి అమలు చేయనున్న ‘నేషనల్‌ పోర్టబిలిటీ’ విధానం కోసం పైలెట్‌ ప్రాజెక్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒక క్లస్టర్‌.. గుజరాత్, మహారాష్ట్రను మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖాధికారులు మహానగరంలో ఈ విధానం అమలుకు సరిగ్గా రెండు నెలల క్రితం ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. అంతకముందు నగరంలోని ఒక ప్రభుత్వ చౌకధరల దుకాణంలో ట్రయల్‌ రన్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో సుమారు లక్షకు పైగా ఏపీ లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. వీరు నేషనల్‌ పోర్టబిలిటీ కింద ఇక్కడే సరుకులు పొందేందుకు వీలుంది. అయితే వారు కేంద్ర ఆహార భద్రత పథకం కింద నమోదై ఉండాలి. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.  పౌరసరఫరా అధికారులు మొత్తం కార్డుదారులను బట్టి 70:30 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ఆహార భద్రత కార్డుల కింద  కేటాయిస్తారు. 

పంపిణీ ఇలా...
తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు నేషనల్‌ పోర్టబిలిటీ కింద బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను కేంద్రం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం అందజేస్తారు. వీరికి ఐదు కిలోల చొప్పున కుటుంబానికి 20 కిలోలకు మించకుండా మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారు. కిలోకు రూ.3 చెల్లించాల్సి ఉంటుంది. అదే తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థానికంగా ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు కిలో బియ్యం రూ.1 చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోలు పంపిణీ చేస్తోంది. బియ్యం కోటాపై పరిమితి లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని ఆరు కిలోల చొప్పున అందిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top