జీఎస్టీని వీడని బాలారిష్టాలు!

Technical issues to the GST

రిటర్నుల దాఖలుకు సాంకేతిక ఇబ్బందులు

ఆగస్టులో 39 శాతం మాత్రమే దాఖలు

అటు డీలర్లు, ఇటు ప్రభుత్వానికీ తిప్పలు

తగ్గిపోయిన పన్నుల వసూళ్లు

దసరా సెలవులతో ఇబ్బందికర స్థితికి ప్రభుత్వ ఖజానా

సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా బాలారిష్టాలు వీడడం లేదు. ముఖ్యంగా జీఎస్టీఎన్‌ పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు అటు డీలర్లను, ఇటు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దాంతో ఆగస్టులో దాఖలు చేయాల్సిన పన్ను రిటర్నుల ప్రక్రియ.. సెప్టెంబర్‌ నెల ముగుస్తున్నా 40 శాతం దాటకపోవడం గమనార్హం. సాంకేతిక సమస్యలకు తోడు డీలర్ల నిర్లక్ష్యం, అవగాహనా లోపం, దసరా సెలవులు కలిపి పన్నుల వసూలు తగ్గి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంది.

జాతీయ సగటు కన్నా తక్కువే..
జీఎస్టీ రిటర్నుల దాఖలులో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా.. ఆ నెలకు సంబంధించి ఆగస్టు 20కల్లా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండేది. కానీ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు, జీఎస్టీపై అవగాహనకు సమయం కావాలన్న యోచనతో గడువును సెప్టెంబర్‌ 15 వరకు పెంచారు. దీంతో కొంతమేర రిటర్నుల దాఖలు పెరిగింది. జూలై నెలకు గాను దేశవ్యాప్తంగా 83 శాతం రిటర్నులు దాఖలుకాగా.. మన రాష్ట్రంలో మాత్రం 74.78 శాతమే వచ్చాయి. దాంతో గడువును తిరిగి సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించారు. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన రిటర్నులను సెప్టెంబర్‌ 20 వరకు దాఖలు చేయాలి.

ఈ గడువును కూడా సెప్టెంబర్‌ 30 వరకు పెంచారు. కానీ ఆగస్టు నెల రిటర్నుల దాఖలు మాత్రం వెనుకబడిపోయింది. ఆగస్టుకు సంబంధించి దేశవ్యాప్తంగా సగటున 48.57 శాతం రిటర్నులు నమోదుకాగా... రాష్ట్రంలో మాత్రం 39.48 శాతమే నమోదయ్యాయి. ప్రభుత్వం తిరిగి గడువు పొడిగిస్తుందనే ఉద్దేశంతోనే డీలర్లు జాప్యం చేస్తున్నారని పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే డీలర్లు మాత్రం విభిన్న వాదన వినిపిస్తున్నారు. వ్యాట్‌ ఉన్నప్పుడు పన్ను కట్టకపోయినా రిటర్నులు దాఖలు చేసేవారమని.. ఇప్పుడు జరిగిన వ్యాపారంపై పన్ను కడితేనే జీఎస్టీఎన్‌ పోర్టల్‌ రిటర్నులను స్వీకరిస్తోందని చెబుతున్నారు. వ్యాపారాల్లో డబ్బు చెల్లింపులకు గడువు ఉంటుందని.. అందువల్ల పన్ను చెల్లింపునకు ముందే రిటర్నుల దాఖలుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు.

ఎన్నో సమస్యలు
జీఎస్టీఎన్‌ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈనెల 9న హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, మరో మూడు రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా సంఘాన్ని నియమించారు. ఈ సంఘం ఈ నెల 20న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. మొత్తం 25 రకాల ప్రధాన సమస్యలు జీఎస్టీ పోర్టల్‌లో ఎదురవుతున్నాయని గుర్తించింది. వాటిని తక్షణమే పరిష్కరించాలని జీఎస్టీఎన్‌కు సాంకేతిక సహకారం అందిస్తున్న ఇన్ఫోసిస్‌ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కానీ ఇంకా ఆ సమస్యలను పరిష్కరించకపోవడంతో జీఎస్టీఎన్‌ సర్వర్‌ డౌన్‌ కావడం, అప్‌ లోడింగ్‌కు సహకరించకపోవడం వంటి ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top