పంతుల్లే పాలకులు..

Teachers became politicians - Sakshi

 బోథ్‌ ఓటర్ల విలక్షణ తీర్పు 

పంతుల్లే పాలకులిక్కడ

 ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారికే ఆదరణ

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌): బోథ్‌ ఎస్టీ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి చట్ట సభల్లోకి వెళ్లేందుకు అధికంగా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారికే ఓట్లు వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 12 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 1962లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం జనరల్‌ స్థానం ఉంది. ఆ తర్వాత 1967లో జరిగిన పునర్విభజనలో ఎస్టీగా మారింది. ఎస్టీ రిజర్వ్‌ స్థానంగా 11 సార్లు ఎన్నికలు జరగగా 7సార్లు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ప్రత్యేకత.

బజార్‌హత్నూర్‌ మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గోడం రామారావు అనుహ్యంగా 1985లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీడీపీ తరఫు నుంచి బోథ్‌ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రామారావు పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1994 ఎన్నికల్లో రామారావు తనయుడు నగేశ్‌కు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. అప్పటికే గోడం నగేశ్‌ బోథ్‌ మండలంలోని పార్టీ బిలో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. రామారావును కాకుండా అప్పట్లో టీడీపీ నగేశ్‌కు టికెట్‌ ఇవ్వడంతో నగేశ్‌ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి బోథ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నగేశ్‌ కూడా చంద్రబాబు మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర జీసీసీ చైర్మన్‌గా పనిచేశారు.

2004 సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో మరోమారు గోడం నగేశ్‌ ఎమ్మెల్యే అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి వచ్చిన రాథోడ్‌ బాపురావు టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి ఓటర్లు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారినే శాసనసభకు పంపడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top