పక్షం రోజులు.. పక్కాగా లెక్క

Survey On Non Communicable Diseases In Peddapalli District - Sakshi

రంగంలోకి 1,258 మంది సిబ్బంది

ఇప్పటికే పూర్తయిన ప్రత్యేక శిక్షణ

ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టనున్న బృందాలు

సాక్షి, పెద్దపల్లి: పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్ఠు బయటపడుతోంది. నియంత్రిస్తున్నామనుకుంటున్న క్షయ విస్తరిస్తోంది. చికిత్సతో నయమయ్యే ఈ రెండు అంటువ్యాధులు పూర్తిగా నియంత్రించవచ్చు. నిర్మూళన కోసం ప్రత్యేక వ్యవస్థలు కృషి చేస్తున్నప్పటికీ.. కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఏకకాలంలో ఈ రెండు వ్యాధులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు సర్వే చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. పక్షం రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్న ఈ ప్రక్రియకు కసరత్తు చేపట్టారు.

రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు పూర్తి ఆరోగ్యం తో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అసంక్రమిత వ్యాధులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించిం ది. పెద్దపల్లి జిల్లాలో ఈనెల 26 నుంచి సర్వే ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌12వరకు కొనసాగనుంది. ప్రతీరోజు ఉదయం పూట 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఏఎన్‌ఎంలు.. మగ వలంటీర్లు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే శిక్షణకూడా పూర్తి చేశారు. 

నెలకు 100కుపైగా క్షయ కేసులు 
ఇటీవల క్షయ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటికే 1000కిపైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. నెలకు 100కుపైగా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. గాలితోనే వచ్చే ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటే క్షయ రోగుల సంఖ్య పక్కగా లెక్కతీస్తే చికిత్స అందించవచ్చన్నది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆలోచన.
జిల్లాలో 49 కుష్ఠు వ్యాధి కేసులు 
పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 49 కుష్ఠు వ్యాధి కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇంకా అక్కడక్కడ కుష్ఠు వ్యాధి కేసులు ఉండచ్చేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. శ్వాసతో వ్యాప్తిచెందడానికి ఆస్కారమున్న వ్యాధికి ప్రాథమికస్థాయిలో చికిత్స అందించకపోతే... శరీరంలో ముక్కు, కాలి, చేతి వేళ్లు కొరికేసినట్లు కరిగిపోతాయి. వైకల్యం ఏర్పడుతుంది. పుండ్లతో ఇబ్బందిగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకయ్యే వ్యాధిని నిలువరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు.

సర్వేకు 1258 మంది..
కుష్ఠు, క్షయ రోగుల లెక్క తేల్చడానికి ఏకకాలంలో సర్వే చేపట్టడానికి ఒక ఆశా కార్యకర్త, మరో పురుషుడిని కార్యకర్తతో ఒక బృందంగా ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ వీరి పరిధిలోని 20నివాసాలు సందర్శించి, పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరించాలి. జిల్లావ్యాప్తంగా సుమారు 8లక్షల జనాభా ఉండగా, ఇందులో 2లక్షల పైచిలుకు నివాసాలున్నాయి. రోజువారీగా పీహెచ్‌సీలకు అనుమానస్పద కేసుల వివరాల సమాచారాన్ని తెలియజేయాలి. జిల్లా వ్యాప్తంగా 514 మంది ఆశా కార్యకర్తలు ఉండగా, వారికి సహాయకులుగా మరో 514 మంది పురుషులను బృందాలుగా నియమించారు. వీ రిపై 230 ఏఎన్‌ఎంలు పర్యవేక్షణ చేపట్టనున్నా రు. సర్వే చేసే సిబ్బందికి ఒక్కోక్కరికి రూ.75 చొప్పున పారితోషికం అందించనున్నారు. 

ఇలా పరీక్షిస్తుంది బృందం 
సర్వే కోసం అధికారులు ఏర్పాటు చేసిన బృందం ఒక ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు.ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు ఆరోగ్య కార్యకర్త వద్ద సిద్ధంగా ఉండడంతో వాటికి ఆధార్‌నంబర్లు జోడించాల్సిఉంది. ఆశా కార్యకర్త మహిళలను, స్వచ్ఛంద కార్యకర్త పురుషుల దేహంపై క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎక్కడన్నా మచ్చలున్నాయా అన్నది చూస్తారు. ఒకవేళ కుష్ఠి వ్యాధికి ప్రాథమిక లక్షణమైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. అందుకే నిశిత పరిశీలన చేస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే, వారి వివరాలను పీహెచ్‌సీకి అందజేస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించిన తర్వాత నిర్ధారిస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక ‘క్షయ’ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. ఒకవేళ రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరంవంటి లక్షణాలు ఉంటే వారికి తెమడ తీయడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ డబ్బాలో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన డీఎంసీల్లో పరీక్షలు చేపడుతారు.వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సమక్షంలో చికిత్స ప్రారంభించే ప్రణాళిక రూపొందిస్తారు.

సర్వేతో కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి 
కుష్ఠు, క్షయ వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించడం ద్వారా కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సోమవారం నుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వే చేపట్టాల్సిన తీరుపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. సర్వే బృందాలకు ప్రజలు సహకరించాలి.
– డాక్టర్‌ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌ఓ, పెద్దపల్లి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top