
గుడిసెలో గణనాథుడు
ధనసామర్థ్యానికి మించింది భక్తి
అని నిరూపించిన బీద బాలుడు
నవరాత్రుల పాటు గణపతిని కొలిచిన చరణ్
కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్బీనగర్ మాతంగి కాంప్లెక్స్ ఎదుట రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లను పైకప్పుగా వేసుకున్న చిన్న గుడిసెలు కనిపిస్తాయి. మట్టి నేలలు, మూటలు, చీపుర్లు, గిన్నెలతో నిండిన చిన్నగదులే అక్కడివారికి నివాసాలు. తాము కడు బీదలమైనా.. మనసు ఎంత గొప్పదో ఓ గుడిసెలోని తొమ్మిదో తరగతి విద్యార్థి చరణ్ నిరూపించాడు. తమ గుడిసెల ముందు గణపతి విగ్రహం ప్రతిష్టించి నవరాత్రులు పూజించాలని భావించాడు. కానీ కూలిపని చేసుకునే తల్లిదండ్రులకు స్తోమత లేదు. అయినా, ఆ బాలుడు వెనకడుగు వేయలేదు.
పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడల్లా ఓ దుకాణంలో పనిచేసి కొంతడబ్బు కూడగట్టుకున్నాడు. ఇందులోంచి రూ.1,500 వెచ్చించి వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఇంటి ఎదుట తడకలతో మండపం నిర్మించాడు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అర్చకుడిగా అవతారం ఎత్తాడు. తొమ్మిది రాత్రులపాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశాడు. భగవంతుడు విగ్రహంలో కాదు.. భావంలో ఉంటాడు. భక్తికి సామర్థ్యం అవసరం లేదు.. హృదయం చాలు.. అని చరణ్ నిరూపించాడు. నవరాత్రులకు తగ్గ ఏర్పాట్లు, అలంకరణలు చేసే స్తోమత లేకపోయినా.. ఆ బాలుడి భక్తి ముందు అవన్నీ దిగదుడుపే అయ్యాయి.
తొమ్మిదిరోజుల పాటు రోజూ పూజలు చేసి, నైవేద్యం సమర్పించాడు. నిత్యం భక్తిపాటలతో అర్చించాడు. చివరకు శుక్రవారం శోభాయత్ర ఘనంగా నిర్వహించాడు. సమీపంలోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశాడు. ఈ సందర్భంగా పులిహోర, మిఠాయిలు కూడా గుడిసెలోనే తయారు చేసి అందరికీ పంచిపెట్టాడు. ఇది చూసిన ప్రతీఒక్కరూ కదిలిపోయారు. ఇది డబ్బుతో చేసేది కాదు.. మనసుతో చేసిన పూజ.. ఈ దృశ్యం మానవాళికి, సమాజానికి ఒక శిక్షణ.. ఈ బాలుడు చూపించిన భక్తి, ధనసామర్థ్యానికి మించిన ఆధ్యాతి్మక సంపదని ప్రశంసలు కురిపించారు.