పెద్దపల్లి జిల్లా(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఓ కొండచిలువ కోతిని మింగి మిగతా వాటి దాడిలో హతమైంది. గ్రామానికి చెందిన చొప్పరి రవి నివాసం ఎదుట సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామశివారులోని చెట్లపొదల్లోంచి జనావాసాల్లోకి చేరుకున్న ఓ కొండచిలువకు కోతుల గుంపు కనిపించింది. దీంతో వాటివైపు కదిలిన కొండచిలువ.. తొలుత చిన్నకోతిపిల్లను మిగింది.
మరో పెద్దకోతిని మింగేందుకు యత్నించగా.. బిగ్గరగా అరిచింది. దీంతో సమీపంలోని సుమారు కోతులు గల గుంపు ఒక్కసారిగా వచ్చి కొండచిలువపై దాడిచేశాయి. ఆ దాడిలో కొండచిలువ చనిపోగా పెద్దకోతి ప్రాణాలతో బయటపడింది. కొండచిలువ భయానికి స్థానికులెవరూ అటువైపు వెళ్లలేదు. సమాచారం అంతుకున్న బేగంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య, బీట్ ఆఫీసర్ పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువ పొడవు 6 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. దానికి పంచనాబా చేసి అటవీప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వివరించారు.
హార్వెస్టర్‌లో పడి కొండచిలువ హతం
చందుర్తి(వేములవాడ): వరికోత కోస్తుండగా హార్వెస్టర్‌లో పడి కొండచిలువ హతమైంది. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన రైతు యెల్ల నరేశ్‌కు చెందిన వరి పొలం కోస్తుండగా హార్వెస్టర్‌లో కొండచిలువ చిక్కి మిషన్ ఆగిపోయింది. మిషన్‌లో చిక్కిన గడ్డిని తొలగిస్తుండగా.. ఆ గడ్డిలోనే కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న రైతులు పెద్ద కొండచిలువ అంటూ పరుగులు పెట్టారు. ఆపరేటర్ మిషన్‌లో చిక్కిన కొండచిలువను తొలగించారు.


