ఆర్టీసీ సమ్మె దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ...
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-నిజామాబాద్, సికింద్రాబాద్-కాజీపేటల మధ్య గురువారం నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.సమ్మె ముగిసే వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ మేరకు కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైలు ఉదయం 7.40కి కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 11.40 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని, తిరిగి సాయంత్రం 5గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి రాత్రి 10.30కు నిజామాబాద్ చేరుకుంటుందన్నారు. తెల్లవారు జామున 3.30 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 7.15కు కాచిగూడ చేరుకుంటుందని వెల్లడించారు.