రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం
కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్
ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం
విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు
అరకుతోపాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్‌ను కోల్పోయిన విశాఖ జోన్
ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్ల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన వైనం..
కూటమి ప్రజాప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం
తద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాదని సర్వత్రా ఆందోళన
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రైల్వే జోన్ అభివృద్ధికి పురిట్లోనే సంధి కొట్టింది! ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల సాధనలో మరోసారి చేతులెత్తేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ప్రాజెక్టుల సాధనలో దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టం హామీ కూడా అయిన విశాఖ రైల్వే జోన్ అందుకు తాజా తార్కాణం. కీలకమైన కొత్తవలస– కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఒడిశా ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది.
రాబడికి భారీగా గండి..
అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ లేకుండానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను కేంద్రం ఖరారు చేసింది. ఈమేరకు గతంలో వెలువడిన ప్రకటనను ధృవీకరిస్తూ రైల్వే శాఖ ఈ నెల 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ సహా అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్‌ను ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్‌లో చేర్చింది. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడినట్టే. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వైఎస్సార్‌సీపీ హయాంలోనే రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.
వాల్తేర్ విభజన...విశాఖ, రాయగడ డివిజన్లు
2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే కేకే లైన్‌తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఉన్న చోట డివిజన్ కేంద్రం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా జోన్‌లో చేరిస్తే ఆ రెండు జిల్లాలకు రైల్వే ప్రాజెక్టుల్లో తగిన న్యాయం జరగదని స్పష్టం చేశారు. కేకే లైన్‌ను కోల్పోతే విశాఖ జోన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.
నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని.. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని పట్టుబట్టింది. వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు కూడా అదే డిమాండ్ చేశాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో పేర్కొంది. అయితే వాల్తేర్ రైల్వే డివిజన్ స్వరూపం ఎలా ఉండబోతుందన్న దానిపై సందిగ్ధత తొలగిపోలేదు.
ఒడిశా ఒత్తిడికే తలొగ్గిన కేంద్రం...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలన్న ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్‌ను నిర్లక్ష్యం చేసింది. దాంతో ఒడిశా ఒత్తిడికి తలొగ్గుతూ కేంద్ర రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, రాయగడ కేంద్రాలుగా రెండు వేర్వేరు రైల్వే డివిజన్లను ఏర్పాటు చేయనుంది.
విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్‌ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస–కిరండోల్ సెక్షన్‌తోపాటు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించింది. వాటిని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో విశాఖ డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది.
మొద్దునిద్రలో బాబు ప్రభుత్వం
కీలకమైన కేకే లైన్ విశాఖ డివిజన్‌కు దూరం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ స్వయం సమృద్ధికి కేకే లైన్ అత్యంత కీలకమని గుర్తు చేస్తున్నారు. కేకే లైన్‌ను విశాఖపట్నం డివిజన్‌లోనే కొనసాగించాలని ఉత్తరాంధ్రవాసులు, వివిధ ఉద్యోగ, కార్మిక, వ్యాపార, వాణిజ్య వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొర పెట్టుకుంటున్నా కూటమి ప్రభుత్వం ఏడాదిగా మొద్దు నిద్ర వీడలేదు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కేకే లైన్ రాయగడ డివిజన్‌లోనే ఉండాలని ఢిల్లీ స్థాయిలో పట్టుబట్టింది. దీంతో కేకే లైన్‌ను ఒడిశాకే కేటాయిస్తూ రాయగడ డివిజన్ పరిధిలో ఉంటుందని ఈ నెల 6న మరోసారి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో విశాఖ, రాయగడ డివిజన్లు ఇలా...
విశాఖపట్నం డివిజన్: పలాస– విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపాడ జంక్షన్– పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్ – సాలూరు, సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్, వదలపూడి– దువ్వాడ, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ – జగ్గయ్యపాలెం సెక్షన్లు
రాయగడ డివిజన్: కొత్తవలస– కిరండోల్, బచ్చెలి / కిరండోల్, కూనేరు– తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్– కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముడి – గుణుపూర్ సెక్షన్లు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఇదీ...
విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఖరారైంది. అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్.. ఇటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను విభజించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తేనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. దక్షిణ కోస్తా రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్ల స్వరూపం ఇలా ఉండనుంది...



