మా ఆరోగ్యశ్రీనే మస్తుంది 

State government not to join in Ayushman Bharat - Sakshi

‘ఆయుష్మాన్‌ భారత్‌’లో చేరబోమన్న రాష్ట్ర ప్రభుత్వం 

కేంద్ర పథకం కన్నా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ బాగుంది 

రాష్ట్రానికి అనుగుణంగా మార్పు చేస్తే పరిశీలిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలనుకోవడం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. కేంద్ర పథకం కన్నా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని, ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాదముందని వివరించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంతో పటిష్టంగా అమలవుతోందని, కాబట్టి కేంద్ర పథకంలో చేరబోమని, ఒకవేళ రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. 

20 లక్షల కుటుంబాలకే లబ్ధి 
ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఆధారంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెబుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న 10.74 కోట్ల కుటుంబాలకు (50 కోట్ల మందికి) ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది.ఆయుష్మాన్‌ భారత్‌కు అర్హుల గుర్తింపులో కఠిన నిబంధనలున్నాయి. ఆరోగ్యశ్రీలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారంతా పథకానికి అర్హులే. రాష్ట్రంలో 77 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతుండగా, ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనల ప్రకారం 20 లక్షల కుటుంబాలే అర్హత పొందుతాయి.  

బైకున్నా.. బోటున్నా అనర్హులే!  
ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఉన్నా, ల్యాండ్‌ ఫోన్‌ ఉన్నా ఆ కుటుంబానికి ఆయుష్మాన్‌ వర్తించదని కేంద్ర నిబంధనలు చెబుతున్నాయి. కుటుంబంలో ఒకరు నెలకు రూ.10 వేలకు మించి సంపాదిస్తున్నా, రెండు చక్రాల బండి ఉన్నా, చేపలు పట్టే బోటున్నా పథకం వర్తించదు. రెండున్నర ఎకరాలకు మించి సాగునీటి వసతి ఉన్న వ్యవసాయ భూమి ఉన్నా పథకానికి అనర్హులు. ఇలా అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రం లేఖ రాసినా స్పందన లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

కార్పొరేట్‌ ఆస్పత్రుల అనాసక్తి 
ఆయుష్మాన్‌ అమలుపై ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. ఆ పథకంలో చేర్చిన 1,354 చికిత్సల్లో 80 శాతానికి పైగా చికిత్సల ధరలు రాష్ట్రంలోని ధరల కన్నా తక్కువే అంటున్నారు. కొన్ని ధరలే రాష్ట్ర పథకాల కన్నా ఎక్కువున్నాయని చెబుతున్నారు. 2014లో నిర్ణయించిన ఆరోగ్యశ్రీ ధరలనే పెంచాలని కార్పొరేట్‌ ఆస్పత్రులు డిమాండ్‌ చేస్తుండగా.. ఆయుష్మాన్‌ భారత్‌లో అంతకన్నా తక్కువ ధరలు నిర్ణయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నిస్తున్నారు.  

‘ఆయుష్మాన్‌’కింద రూ.280 కోట్లే..  
ఆరోగ్యశ్రీతో రాష్ట్ర ప్రభుత్వానికి పేరొచ్చింది. పైగా దాని కోసం ఏటా రూ.700 కోట్లకు పైగా కేటాయిస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రానికి కేంద్రం రూ. 280 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో కలిపి ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తే ఆరోగ్యశ్రీ పేరు మరుగునపడుతుంది. అంతా తామే చేస్తున్నామని కేంద్రం చెప్పుకునే అవకాశముంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర సర్కారు భావనగా చెబుతున్నారు. కొందరు ఆయుష్మాన్‌ భారత్‌లో చేరితే నిధులొస్తాయని, ఆ మేరకు ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని, పేరును దెబ్బతీసేలా ఉంటే కేంద్ర పథకంలో చేరబోమని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top