నెట్‌వర్క్ ఆస్పత్రులకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయని సర్కారు..
గత ఆర్థిక సంవత్సరం రూ.336 కోట్లకు గాను రూ.143 కోట్లు పెండింగ్
దీంతో ఈహెచ్‌ఎస్ సేవలకు కార్పొరేట్ ఆస్పత్రులు మంగళం
తీవ్ర అగచాట్లు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు
సాక్షి, అమరావతి: ‘‘ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు.. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఐఆర్ ప్రకటన.. అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు’’.. ఇలా 2024 ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు మేనిఫెస్టోలో హామీలిచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక వారిని నిలువునా వంచించారు.
ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో పాటు వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) పథకానికి నెలనెలా తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తున్నా.. ఆపద సమయంలో పథకం ఆదుకోవడంలేదని వారు గగ్గోలు పెడుతున్నారు.
చెల్లింపులు ‘సున్నా’
రాష్ట్రంలో ఈహెచ్‌ఎస్ పథకంపై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు. వీరికి నగదు రహిత వైద్యసేవలు అందించిన నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ తోపాటు, ఈహెచ్‌ఎస్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. అలాగే, గతేడాది గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్‌ఎస్ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రూ.95 కోట్ల మేర బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆమోదించగా వీటిలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. 2024–25లో రూ.336 కోట్ల మేర బిల్లులు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉండగా రూ.140 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన బిల్లులతో పాటు, ట్రస్ట్ స్థాయిలో పరిశీలనలో ఉన్న క్లెయిమ్‌లతో కలిపి రూ.350 కోట్ల మేర బకాయి పడినట్లు సమాచారం.
ఇలా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులన్నీ కొద్దినెలలుగా ఈహెచ్‌ఎస్ సేవలకు పూర్తిగా మంగళం పాడేశాయి. డబ్బుకట్టి వైద్యం చేయించుకుని రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెబుతున్నాయి.
దీంతో.. క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు ఉచిత వైద్యసేవలు అందక తీవ్ర అగచాట్లు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పైగా.. అప్పుచేసి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్ విషయంలోనూ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రూ.లక్షల్లో వైద్య ఖర్చులుంటే, మంజూరు చేసేది మాత్రం రూ.వేలల్లోనే ఉంటోంది.


