ఆరోగ్యశ్రీపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
నెట్‌వర్క్ ఆసుపత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
రూ.2 లక్షల కోట్ల అప్పుచేసి ప్రజారోగ్యాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?
టీడీపీ కూటమి పాలనలో వైద్యరంగం నిర్విర్యం
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌చానెల్ ఏర్పాటుచేసి దాని ద్వారా నెట్‌వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్లు చొప్పున కేటాయించాలని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సమాఖ్య ప్రతినిధులతో ఆ శాఖ మంత్రి చర్చలు జరిపి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్లను మరుగుపర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీని నీరుగాస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ పేరు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా ఉండడానికి కారణం ఆరోగ్యశ్రీ అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారానే లభించిందని, తద్వారా అనేకమంది పేదలు ప్రాణాలు దక్కించుకున్నారని గుర్తుచేశారు. గోపిరెడ్డి ఏమన్నారంటే..
నెట్‌వర్క్ ఆస్పత్రులను
చర్చలకు పిలవడం లేదు..
ఏ ప్రభుత్వం వచి్చనా ఆరోగ్యశ్రీని తీసివేసే ధైర్యం చేయట్లేదంటే ఈ పథకం ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో అర్థం చేసుకోవాలి. వైఎస్సార్ హయాంలో 1,700 జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందజేస్తే వైఎస్ జగన్ పాలనలో 3,007 జబ్బులను ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యనూ 900 నుంచి రెండు వేలకు పెంచి పరిమితిని కూడా రూ.5 లక్షల రూ.25 లక్షలకు పెంచారు. వైఎస్సార్, జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్న అక్కసుతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్విర్యం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టింది.
దీనివల్ల మొన్నటి దాకా 9వేల ఆపరేషన్లు జరిగితే ఆ సంఖ్య ఇప్పుడు మూడువేలకు తగ్గింది. అవి కూడా ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లోనే జరుగుతున్నాయి. 18 రోజుల నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె చేస్తుంటే ఆ ప్రతినిధులను చర్చలకు కూడా పిలవడంలేదు. 104, 108 సేవలను గతంలో అరబిందో, జీవికే లాంటి సంస్థలు నిర్వహించాయి. ఇప్పుడీ సేవలను రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని టీడీపీ డాక్టర్ల సంఘం అధ్యక్షుని కంపెనీకి కట్టబెట్టి ఆ వ్యవస్థనూ భ్రష్టుపట్టిస్తున్నారు. ఏడాదిన్నరలో రూ.2 లక్షల కోట్లు అప్పుచేసిన ఈ ప్రభుత్వం ఆ డబ్బును ప్రజారోగ్యం మీద ఎందుకు ఖర్చుచేయడంలేదు.?


