దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు విజయవాడ డివిజన్‌లో ముందస్తు చర్యల గురించి వివరిస్తున్న డీఆర్‌ఎం
ముందస్తు భద్రత చర్యలు చేపట్టాం
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ వెల్లడి
రైల్వే లైన్ల వెంట 24 గంటలు పెట్రోలింగ్
ముఖ్యమైన స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
మొత్తం 97 రైళ్ల రద్దు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): మోంథా తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సోమవారం విజయవాడకు చేరుకుని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, కోఆర్డినేషన్ అండ్ సెక్యూరిటీ డీజీఎం శ్రీనివాస మల్లాది, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ కె.పద్మజ, పలు బ్రాంచ్‌ల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలను మార్చుకుని అధికారులు, సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని జీఎం సూచించారు.
డీఆర్‌ఎం మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌లో ప్రయాణికులు, సిబ్బంది, రైల్వే ఆస్తుల భద్రత కోసం ఆపరేటింగ్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను హై అలర్ట్‌లో ఉంచామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలు, కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజిన్లు, మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.
హెల్ప్‌డెస్క్ ల ఏర్పాటు
ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు విజయవాడతోపాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి తదితర ముఖ్య స్టేషన్లలో 24 గంటలు సేవలు అందించేలా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని డీఆర్‌ఎం తెలిపారు. రద్దయిన రైళ్లకు చెందిన, ప్రయాణాలను రద్దు చేసుకున్న ప్రయాణికుల కోసం రిఫండ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ(ఏపీఎస్‌డీఎంఏ)ని సమన్వయం చేసుకుంటూ రైల్వేశాఖ నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందని వివరించారు.
97 రైళ్ల రద్దు
తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్‌ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు
సాక్షి, అమరావతి: తుపాను హెచ్చరికల వల్ల పలు బస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సోమవారం ఆర్టీసీ ఈడీలు, ఆర్‌ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ చేపట్టాల్సిన ముందస్తు చర్యలను నిర్దేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బస్సుల రాత్రి హాల్ట్‌ను రద్దు చేసింది. సోమవారం రాత్రి 9గంటల నుంచి తుపాను ప్రభావం తగ్గేంతవరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు కమ్యూనికేషన్ సెల్‌లను ఏర్పాటు చేసింది. అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో కనీసం 10 మంది డ్రైవర్లు, 10 మంది కండక్టర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.


